రైల్లో బాంబు ఉందంటూ ఫోన్..?
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేస్తున్న బాంబు, డాగస్క్వాడ్..
హైదరాబాద్: రైలులో బాంబు ఉందంటూ డయిల్ 100కు ఓ ఆకతాయి చేసిన ఫోన్ కాల్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం ఉదయం 10.20గంటల సమయంలో డయిల్ 100కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న రైల్లో బాంబు పెట్టినట్లు చెప్పాడు. దీంతో రైల్వేతోపాటు స్థానిక పోలీసులను అధికారులు అప్రమత్తం చేశారు. అప్పటికే ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ కాజీపేటలో ఉండటంతో అక్కడే నిలిపి తనిఖీలు చేపట్టారు. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ చర్లపల్లి స్టేషన్‌కు చేరుకోగా సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్‌స్పెక్టర్ శ్రీను, ఆర్పీఎఫ్, బాంబుస్క్వాడ్, డాగ్‌స్క్వాడ్, ఐఎస్‌డబ్ల్యూ, సీఎస్‌డబ్ల్యూ, ప్రత్యేక బృందాలతో వెళ్లి తనిఖీలు చేశారు. బాంబు ఆనవాళ్లు లభ్యంకాకపోవడంతో ఆకతాయి ఫోన్‌కాల్‌గా గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం రైళ్లు వేర్వేరు సమయాల్లో సికింద్రాబాద్‌కు చేరుకున్నప్పటికీ స్థానిక గోపాలపురం పోలీసులతో కలిసి జీఆర్పీ, ఆర్పీఎఫ్, బాంబుస్వ్కాడ్, డాగ్‌స్వ్కాడ్ బృందాలు రైళ్లు, రైల్వేస్టేషన్‌లోని ప్రయాణికుల బ్యాగులను క్షుణ్నంగా తనిఖీ చేశాయి.
రైలులో బాంబు పెట్టామని ఫోన్ చేసిన వ్యక్తిని పేట్‌బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. పేట్‌బషీరాబాద్ సీఐ ఎస్.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం… దుండిగల్-గండిమైసమ్మ మండలం బహదూర్‌పల్లికి చెందిన తొర్రి కార్తీక్ (19) సూరారం సమీపంలోని ఓ ప్రైవేటు పరిశ్రమలో పని చేస్తున్నాడు. ఇటీవల ఒడిశాలో ఇలాంటి ఘటన జరిగిన నేపథ్యంలో నిందితుడు కార్తీక్ ఆకతాయిగా డయిల్ 100కు ఫోన్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు..