హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా వ్యవహరిస్తోందని భాజపా రాష్ట్ర నాయకులు ధ్వజమెత్తారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ భాజపా కార్యకర్తలను అణచి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు భాజపా రాష్ట్ర ప్రతినిధుల బృందం రాజ్భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. భాజపా నేతలు రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డిలతో కూడిన ప్రతినిధుల బృందం ఖమ్మం, రామాయంపేట ఆత్మహత్యల ఘటనలపై సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నరు కోరారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. “రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ హత్యలు, పోలీసుల ప్రవర్తనపై గవర్నరు ఫిర్యాదు చేశాం. ప్రతిపక్ష నాయకులను కౌన్సెలింగ్ పేరుతో హింసిస్తున్నారు. రాష్ట్ర పోలీసులు విచారణ జరిపితే నిష్పక్షపాతంగా జరగదు. కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరాం. ఖమ్మంలో సాయి గణేశ్, కామారెడ్డిలో సంతోష్, పద్మల ఆత్మహత్యలపైన సీబీఐతో విచారణ జరిపించాలి” అని అన్నారు..
రాజకీయ ప్రత్యర్థులను వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని రామచందర్ రావు అన్నారు. “అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. భాజపా కార్యకర్తలను అణిచి వేస్తున్నారు. భాజపాపై తెరాస దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. పువ్వాడ అజయ్ పై వచ్చిన ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. అజయ్ రాజీనామా చేయకపోతే ప్రభుత్వం బర్తరఫ్ చేయాలి” అని రామచందర్ రావు డిమాండ్ చేశారు.
పోలీసులు తెరాస కార్యకర్తల్లా పని చేస్తున్నారని పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. “సాయిగణేశ్ ఆత్మహత్య వ్యవహారంలో పువ్వాడ అజయ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఖమ్మం, రామాయంపేట ఘటనలపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కోరాం. కేసీఆర్ రాజ్యాంగం పేరుతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు” అని సుధాకర్ రెడ్డి ఆరోపించారు..