ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: శ్రీనివాస రామానుజన్ సేవలు చాలా విశిష్టమైనవని భారతదేశ గర్వించదగ్గ గొప్ప గణిత శాస్త్రవేత్త అని పాఠశాల నిర్వాహకులు డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని స్థానిక బైపాస్ రోడ్ లో గల అల్ఫోర్స్ హై స్కూల్ (సీబీఎస్ఇ)) వేడుకగా శనివారం నిర్వహించినటువంటి జాతీయ గణిత దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ప్రారంభానికి ముందు వారు ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు గణిత శాస్త్రం చాలా ముఖ్యమైనదని మరియు గణిత శాస్త్రం ద్వారా వారు వివిధ పోటీ పరీక్షలలో విజయాన్ని చాలా సులభంగా సాధించగలిగే అవకాశం ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పారు. ప్రతి విద్యార్థి గణిత శాస్త్రంలోని ప్రతి విషయాన్ని సమగ్రంగా, విశ్లేషణాత్మకంగా గ్రహించి సాధన చేసి, పట్టు సాధించి, విజయవకాశాలను మెరుగుపరచుకొని సమాజంలో అగ్రగామిగా కొనసాగాలని చెప్పారు. చిన్ననాటి నుండే శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రం పట్ల మక్కువ పెంచుకోవడమే కాకుండా వాటిలో నైపుణ్యం పొంది అనేక మార్గదర్శక సూత్రాలను రూపొందించి నేటికీ ప్రపంచంలో వారి సూత్రాలను అమలుపరచడం వారి కృషికి నిదర్శనమని చెప్పారు.
భారతదేశ ప్రభుత్వం వారు సేవలను గుర్తించి డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించి వారి సేవలకు గుర్తింపు ఇచ్చారని కొనియాడుతూ ప్రతి విద్యార్థి రామానుజన్ అడుగుజాడల్లో పయనించి ప్రతిభను కనబరిచి అగ్రగామిగా ఉండాలని ఆకాంక్షించారు. వేడుకల సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఆలోచింపచేసాయి. అదే విధంగా గణిత ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి శుభాభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.