ఆంజనేయులు న్యూస్: యోగా ఏ ఒక్కరికో చెందినది కాదు.. అందరిదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. యోగాతో క్రమశిక్షణ, ఏకాగ్రత అలవడుతుందని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్ణాటకలోని మైసూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని యోగాసనాలు వేశారు. అనంతరం ప్రధాని మాట్లాడారు. యోగాను గుర్తించిన ఐక్యరాజ్యసమితి (ఐరాస) సహా ప్రపంచ దేశాలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. “భారత ప్రత్యేకతను, వైవిధ్యాన్ని యోగా ప్రతిబింబిస్తుంది. కొన్ని నిమిషాలపాటు చేసే ధ్యానం మనల్ని ఉత్తేజితుల్ని చేస్తుంది.
యోగా దినోత్సవం.. ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచిక. ప్రస్తుతం యోగా ప్రపంచం నలుమూలలా విస్తరించింది. కరోనా విపత్తు సమయంలోనూ దీన్ని నిర్వహించాం. సమాజంలో శాంతి నెలకొల్పి సమస్యల పరిష్కారానికి యోగా దోహదం చేస్తుంది.. జీవన విధానానికి మార్గంగా నిలుస్తుంది. ఇది వ్యక్తికే పరిమితం కాదు.. సకల మానవాళికి ఉపయుక్తమైనది. యోగా సందేశాన్ని సకల మానవాళికి చేరవేయాలి” అని మోదీ ఆకాంక్షించారు..