Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 12:33 pm Posted by : Anjaneyulu Dega

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలి

తెలంగాణ తల్లి విగ్రహానికి జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి వినతిపత్రం

మంచిర్యాల నవంబర్ 25, ( ఆంజనేయులు న్యూస్ )

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్ (EWS) రిజర్వేషన్లను రద్దు చేయాలని, బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ల అంశంపై గతంలో సుప్రీంకోర్టు ఇంద్రా సహానీ కేసులో తీర్పు ఇచ్చినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం 2019లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణాల్లోని ఆర్థికంగా బలహీన వర్గాలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించిందని పేర్కొన్నారు. అయితే దశాబ్దాలుగా బీసీలు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసినప్పుడు 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ప్రస్తావిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో రాజ్యాంగ సవరణ చేసిందని విమర్శించారు. అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన తరహాలోనే బీసీల రిజర్వేషన్ల కోసం కూడా రాజ్యాంగ సవరణ చేసి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్, సీనియర్ న్యాయవాది కర్రే లచ్చన్న, శాఖపురి భీంసేన్, జిల్లా కార్యదర్శి పెద్దల చంద్రకాంత్, ఎండీ లతీఫ్, దేవసాని నాగరాజు, అంకం సతీష్, పిట్టల దశరథం, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.