Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 1:32 pm Posted by : Anjaneyulu Dega

క్యాతనపల్లిలో అధికారుల ‘రోడ్’ ఇష్టారాజ్యం!

డ్రైనేజీ పనుల తీరుపై కాలనీవాసుల అనుమానాలు.. అధికారుల నుంచి స్పష్టత కరువు.

క్యాతనపల్లి, నవంబర్ 20, ( ఆంజనేయులు న్యూస్ )

క్యాతనపల్లి మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనుల తీరుపై వివాదం నెలకొంది. 30 ఫీట్ల వెడల్పు కలిగిన రహదారిని 20 ఫీట్లకు కుదిస్తున్నారా? అనే అనుమానాలు కాలనీవాసుల్లో వ్యక్తమవుతున్నాయి. రోడ్లను విస్తరించాల్సిన సమయంలో ఉన్న రహదారుల వెడల్పు తగ్గించే పరిస్థితి ఎందుకు వచ్చిందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డుకు ఆనుకుని డ్రైనేజీ నిర్మాణం చేపడుతూ సుమారు ఐదు అడుగుల స్థలం విడిచిపెడుతున్నారని, దీనివల్ల రహదారి వెడల్పు తగ్గే అవకాశం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వాహనాల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రోడ్డు కుదిస్తే భవిష్యత్తులో రాకపోకలకు ఇబ్బందులు తప్పవని పేర్కొంటున్నారు. అదే ప్రాంతంలో కొందరు భవన యజమానులు రోడ్లకు ఆనుకుని సెప్టిక్ ట్యాంకులు, షెడ్లు ఏర్పాటు చేసుకున్నారని, వాటికి ఇబ్బంది కలగకుండా డ్రైనేజీ పనులు చేపడుతున్నారా? అనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణల్లో వాస్తవమెంత అన్నది అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది. రోడ్డు పనుల తీరుపై కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేసినప్పుడు తమ పట్ల అవమానకరంగా వ్యవహరించారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు పత్రాలను ముఖంపై విసిరినట్లు పేర్కొంటున్నారు. ఈ ఆరోపణలపైనా కమిషనర్ స్పందించాలని కోరుతున్నారు. అసలు రహదారి వెడల్పు 30 ఫీట్లేనా? నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత ఎంత వెడల్పు మిగులుతుంది? మున్సిపాలిటీ ఆమోదించిన ప్రణాళికలో రోడ్డు కొలతలు ఎంతగా ఉన్నాయి? అనే వివరాలను అధికారులు వెల్లడించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన రహదారులను కుదించకుండా “30 ఫీట్ల రహదారిని యథాతథంగా కొనసాగించాలని. రోడ్డు వెడల్పు తగ్గించే చర్యలు చేపడితే ఆందోళనకు దిగుతామని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు.”