పెద్దపల్లి, నవంబర్ 18, ( ఆంజనేయులు న్యూస్ )
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు మరో అవినీతి అధికారి చిక్కారు. కేసులో నిందితులకు అనుకూలంగా వ్యవహరించి లబ్ధి చేకూర్చేందుకు లంచం డిమాండ్ చేసిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏసీబీ వలకు చిక్కారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకెన రవీందర్ రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలోని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.. వివరాల్లోకి వెళ్తే.. 2023లో ధర్మారం మండలం రచ్చపల్లిలో జరిగిన భూ వివాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో నిందితులకు అనుకూలంగా వ్యవహరించి వారికి లబ్ధి చేకూర్చేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రవీందర్ రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా బుధవారం రూ.1.50 లక్షలు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఏసీబీ అధికారులు తదుపరి విచారణ చేపట్టారు.