Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 12:12 pm Posted by : Anjaneyulu Dega

సాగునీరు బంద్‌తో చివరి ఆయకట్టు రైతుల ఆందోళన

సాగునీరు విడుదల చేయాలని తిమ్మాపూర్ ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న రైతులు.

మంచిర్యాల నవంబర్ 5, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల జిల్లా జన్నారం మండల పరిధిలోని చివరి ఆయకట్టు రైతులు సాగునీరు అందక ఆందోళనకు దిగారు. గత రెండు రోజులుగా కడెం ప్రాజెక్టు నుంచి పొలాలకు నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు ప్రకటన రావడంతో తిమ్మాపూర్, రాంపూర్ గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తమ పొలాల్లో పంటలు పొట్ట దశలో ఉన్నాయని, ఈ కీలక సమయంలో నీరు నిలిపివేస్తే పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీ వరకు సాగునీటిని నిరంతరంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతులంతా కలిసి తిమ్మాపూర్ కామన్ మెయిన్ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. నీరు అందకపోతే పంటలు నష్టపోయి అప్పులపాలవుతామని, తమకు ఆత్మహత్యలే దిక్కవుతాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ధర్నాలో సర్పంచుల ఫోరం జన్నారం మండల మాజీ అధ్యక్షుడు జాడి గంగాధర్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.


• ప్రకటన •