Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 4:26 pm Posted by : Anjaneyulu Dega

భట్టి విక్రమార్క నియోజకవర్గంలో గురుకుల పాఠశాలల దుస్థితి.. ఇద్దరు విద్యార్థినులకు గాయాలు.

బోనకల్ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో స్లాబ్ పెచ్చులు ఊడి గాయపడిన విద్యార్థినులు.

ఖమ్మం, అక్టోబర్ 31, ( ఆంజనేయులు న్యూస్ )

ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలలో ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాలలోని తొమ్మిదో తరగతి గదిలో ఒక్కసారిగా పైకప్పు స్లాబ్ పెచ్చులు ఊడిపడటంతో పూజిత, కీర్తన అనే ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు. ఈ ఘటనతో పాఠశాలలోని విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించాల్సిన ప్రభుత్వ విద్యాసంస్థల్లో భవనాల నిర్వహణపై నిర్లక్ష్యం ఇలాంటి ప్రమాదాలకు కారణమవుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థినులు చదువుకునే తరగతి గదుల్లోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పాఠశాల భవనాల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ప్రభుత్వ విద్యాసంస్థల పరిస్థితిపై ఈ ఘటన చర్చకు దారితీసింది. విద్యార్థినుల భద్రత దృష్ట్యా అధికారులు వెంటనే స్పందించి పాఠశాల భవనాన్ని పరిశీలించాలని, ప్రమాదకరంగా ఉన్న గదులకు మరమ్మతులు చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


• ప్రకటన •



మీ వ్యాపార, ఇతర ప్రకటనల ప్రచురణ కోసం “ఆంజనేయులు న్యూస్‌” ను సంప్రదించండి.