Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 2:37 pm Posted by : Anjaneyulu Dega

మంచిర్యాల, దండేపల్లి ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందం: సీపీ అంబర్ కిషోర్ ఝా

సోషల్ మీడియాలో వస్తున్న నిర్ధారణ కాని, అసత్య సమాచారాన్ని నమ్మవద్దని ప్రజలకు సూచించిన సీపీ.

రామగుండం అక్టోబర్ 30, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల జోన్ పరిధిలోని మంచిర్యాల, దండేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను వెలికితీయాలనే ఉద్దేశంతో సీసీఎస్ ఏసీపీ నేతృత్వంలో ఈ బృందాన్ని నియమించినట్లు తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందం సంఘటన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు సంబంధిత వ్యక్తులు, సాక్షులను విచారించనుంది. సాంకేతిక ఆధారాలను సేకరించి విశ్లేషించడం ద్వారా ఘటనలకు సంబంధించిన వాస్తవాలను, ఆయా ఘటనల్లో సంబంధిత వ్యక్తుల పాత్రను నిర్ధారించనుంది. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మంచిర్యాల, దండేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు 24 గంటలూ అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని సీపీ పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఊహాజనిత, నిర్ధారణ కాని, అసత్య సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని, వాటి ఆధారంగా ఆందోళనకు గురికావద్దని సీపీ సూచించారు. పోలీస్ శాఖ అధికారికంగా విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ ప్రాధాన్యతని, శాంతిభద్రతల పరిరక్షణకు రామగుండం పోలీస్ కమిషనరేట్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని సీపీ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు.

శ్రీ నందిని నృత్యాలయం – కూచిపూడి క్లాసికల్ డాన్స్ ప్రకటన.