Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 7:01 pm Posted by : Anjaneyulu Dega

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ!

అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ.10 లక్షలు డిమాండ్.. చివరకు రూ.లక్షకు ఒప్పందం

హైదరాబాద్, అక్టోబర్ 28, ( ఆంజనేయులు న్యూస్ )

కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు రూ.10 లక్షల లంచం డిమాండ్ చేసిన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కొత్తూర్ విజయ్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. మొదట భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిన ఎస్‌ఐ, చివరకు రూ.లక్ష తీసుకునేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఓ కోర్టు కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ఎస్‌ఐ విజయ్ లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అధికారులు రంగంలోకి దిగారు. బుధవారం నిర్వహించిన దాడుల అనంతరం ఎస్‌ఐపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు అధికారే లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలు పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారాయి. కేసుల విషయంలో చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన అధికారులు లంచాలకు పాల్పడితే సామాన్యులకు న్యాయం ఎలా జరుగుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.