Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 1:24 pm Posted by : Anjaneyulu Dega

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.. స్వేచ్ఛా జీవితాన్ని ఎంచుకోవాలి

మంచిర్యాలలో నషాముక్తి భారత్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన అదనపు కలెక్టర్ చంద్రయ్య

మంచిర్యాల, అక్టోబర్ 28, ( ఆంజనేయులు న్యూస్ )

మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై యువత, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు నషాముక్తి భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బెల్లంపల్లి చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అదనపు జిల్లా కలెక్టర్ చంద్రయ్య ఐఏఎస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రైవేట్ జూనియర్ కళాశాల విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు కలిపి సుమారు 500 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు జిల్లా కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు గవర్నర్ సూచనల మేరకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 14వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాలకు బానిస కావద్దని, స్వేచ్ఛాయుతమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల మానసిక ఆందోళన, దూకుడు ప్రవర్తన, నిరాశ, నిద్రమత్తు, చదువుపై ఏకాగ్రత తగ్గడం, విద్యాసంస్థలకు గైర్హాజరు కావడం వంటి సమస్యలు తలెత్తుతాయని వివరించారు. వీటితోపాటు ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు. విద్యార్థులు ధూమపానం, మద్యపానం, గుట్కా, పొగాకు, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కళాశాలల్లో అధ్యాపకులు ప్రతిరోజూ విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని సూచించారు. పరిసరాల్లో జరుగుతున్న అనుమానాస్పద పరిణామాలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలపై అదనపు జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ శ్రీధర్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ సునీల్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి అంజయ్య, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, జిల్లా వైద్య బృందం సభ్యులు అల్లాడి శ్రీనివాస్, నాందేవ్, పుట్ట సత్తయ్య, లక్ష్మణస్వామి, సురేందర్, దిశా కార్యకర్తలు, వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.