Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 6:58 pm Posted by : Anjaneyulu Dega

డిగ్రీలు పెరిగాయ్‌.. కొలువులేవీ!

ఉన్నత విద్యావంతుల్లోనూ తీవ్ర నిరుద్యోగం.. యువత భవిష్యత్తుపై ప్రశ్నలు

తెలంగాణ అక్టోబర్ 23, ( ఆంజనేయులు న్యూస్ ప్రత్యేక కథనం )

దేశంలో డిగ్రీలు పెరుగుతున్నా యువతకు తగిన ఉద్యోగాలు మాత్రం లభించడం లేదు. చేతిలో పట్టాలు ఉన్నా కొలువులు దక్కక లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ప్రైవేటు రంగంలోనూ విద్యార్హతలకు తగిన ఉపాధి లభించకపోవడంతో యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. యువతే దేశ బలమని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం వారికి నాణ్యమైన ఉపాధి కల్పించడంలో ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) గణాంకాల ప్రకారం, పట్టభద్రుల నిరుద్యోగ రేటు 2022–23లో 13.4 శాతం, 2023–24లో 13 శాతంగా నమోదైంది. ఉన్నత విద్య అభ్యసించిన వారిలోనూ ఉద్యోగాల కొరత కొనసాగుతోంది. విద్యార్హతలకు తగిన ఉద్యోగాలు లభించకపోవడం యువతను ఆందోళనకు గురిచేస్తోంది. అనేక విద్యాసంస్థల్లో బోధిస్తున్న పాఠ్యాంశాలు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా లేకపోవడంతో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాల కొరత ఏర్పడుతోంది. కళాశాలల్లో సాంకేతిక పరిజ్ఞానం, ఆచరణాత్మక శిక్షణ, సమస్యలను పరిష్కరించే సామర్థ్యంపై తగిన దృష్టి పెట్టడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఖరీదైన ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులు పూర్తి చేసిన వారిలోనూ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు కొరవడుతున్నాయి. విద్యావ్యవస్థను ఉద్యోగ మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా మార్చడంతోపాటు విద్యార్థులకు పని అనుభవం కల్పించాల్సిన అవసరం ఉంది. మరోవైపు కృత్రిమ మేధ (ఏఐ) విస్తరణతో ఐటీ, బీపీఓ, బ్యాంకింగ్‌, కస్టమర్‌ సేవల వంటి రంగాల్లో ఉద్యోగాల స్వరూపం మారుతోంది. సమాచార విశ్లేషణ, సాధారణ సాఫ్ట్‌వేర్‌ పనులు, వినియోగదారులకు సమాధానాలు ఇవ్వడం వంటి పనులను ఏఐ నిర్వహిస్తుండటంతో కొన్ని ఉద్యోగాల్లో సిబ్బంది అవసరం తగ్గే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో యువతకు కొత్త సాంకేతికతలపై శిక్షణ అందించడం, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను పెంచడం కీలకంగా మారింది. దేశంలో తయారీ రంగం ఆశించిన స్థాయిలో విస్తరించకపోవడం కూడా ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపుతోంది. మరోవైపు వెల్డర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, మెకానిక్‌ల వంటి నైపుణ్య వృత్తులకు తగిన ప్రాధాన్యం లేకపోవడంతో యువత వాటివైపు మొగ్గు చూపడం లేదు. స్థిరమైన ఉద్యోగాలు దొరకక చాలామంది ఆహార పంపిణీ, రవాణా, ఆన్‌లైన్‌ సేవల వంటి గిగ్‌ పనులపై ఆధారపడుతున్నారు. అయితే ఈ రంగాల్లో ఉద్యోగ భద్రత, స్థిరమైన వేతనాలు, భవిష్యత్తులో ఎదుగుదలపై అనిశ్చితి కొనసాగుతోంది. యువతకు నైపుణ్యాలు, ఉపాధి కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం స్కిల్‌ ఇండియా, ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ వంటి కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. అయితే పథకాల లక్ష్యాలకు, క్షేత్రస్థాయిలో సాధించిన ఫలితాలకు మధ్య అంతరం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శిక్షణ పొందిన యువతలో ఎంతమందికి ఉద్యోగాలు లభించాయి? వారికి ఎంత వేతనం అందుతోంది? ఉద్యోగ భద్రత ఎంతవరకు ఉంది? అనే అంశాలపై స్పష్టమైన ఫలితాలు వెల్లడించాల్సిన అవసరం ఉంది. విద్యను పరిశ్రమల అవసరాలకు అనుసంధానించడం, కళాశాలల్లో ఆచరణాత్మక శిక్షణ పెంచడం, వృత్తి విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం, తయారీ రంగంలో ఉద్యోగాలను విస్తరించడం ద్వారా నిరుద్యోగ సమస్యను తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. యువతకు నైపుణ్య శిక్షణతోపాటు స్థిరమైన ఉద్యోగాలు, న్యాయమైన వేతనాలు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. యువతే దేశ భవిష్యత్తని చెప్పడం కాకుండా, వారి విద్యార్హతలకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే ఆ మాటలకు సార్థకత చేకూరుతుంది.