తెలంగాణలోనూ ఏర్పాటు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి
తెలంగాణ అక్టోబర్ 23, ( ఆంజనేయులు న్యూస్ )
విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ గుజరాత్‌లోని వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ (VNSGU) కీలక చర్య చేపట్టింది. యూనివర్సిటీ హాస్టళ్లలో 354 స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక ఫ్యాన్లపై 10 కిలోలకుపైగా బరువు పడితే అవి కిందకు వేలాడుతూ విద్యుత్ సరఫరా నిలిచిపోయేలా రూపొందించారు. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడంలో భాగంగా తీసుకున్న ఈ చర్యపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. విద్యార్థుల ప్రాణాలను కాపాడేందుకు ఇలాంటి భద్రతా చర్యలు ఎంతో అవసరమని అభిప్రాయపడుతున్నారు. గుజరాత్‌లో అమలు చేస్తున్న ఈ విధానాన్ని తెలంగాణలోని యూనివర్సిటీలు, హాస్టళ్లలోనూ ప్రవేశపెట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి తోడ్పాటుతో పాటు, ఆత్మహత్యలను నివారించే భద్రతా ఏర్పాట్లపై కూడా ప్రభుత్వం, యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంజనేయులు న్యూస్ విజ్ఞప్తి.! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థల హాస్టళ్లలో యాంటీ సూసైడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆంజనేయులు న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యార్థుల అమూల్యమైన ప్రాణాలను కాపాడేందుకు ఇలాంటి భద్రతా చర్యలను త్వరితగతిన అమలు చేయాలని కోరుతున్నాం.