Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 10:16 pm Posted by : Anjaneyulu Dega

ఎల్నినో ప్రభావంతో మరో 8–10 నెలలు ఎండల తీవ్రత!

ప్రజల భాగస్వామ్యంతోనే కరవును ఎదుర్కోగలం: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, అక్టోబర్ 23, ( ఆంజనేయులు న్యూస్ )

ఎల్నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తీవ్ర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మరో ఎనిమిది నెలల పాటు ఎండల తీవ్రత కొనసాగుతుందని, ప్రజల భాగస్వామ్యం లేకుండా కరవును ఎదుర్కోలేమని స్పష్టం చేశారు. ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలతో సమావేశమైన సీఎం.. ఎల్నినో ప్రభావం, కరవు పరిస్థితులు, నీటి లభ్యత, విద్యుత్ వినియోగంపై చర్చించారు. సమావేశం అనంతరం సీఎం మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఎండలకు కరోనా చనిపోతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందంటూ బీఆర్ఎస్ నేతలు రాజకీయ దురుద్దేశంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలపై ఎల్నినో ప్రభావం ఉందని, అభివృద్ధి చెందిన మహారాష్ట్రలోనూ నీటి ఎద్దడి నెలకొందని తెలిపారు. అక్కడ నీటి వినియోగాన్ని 20 శాతం తగ్గించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో రిజర్వాయర్లలో నీటి నిల్వలు 20 శాతం కూడా లేవని, వచ్చే నాలుగు నెలల పాటు వ్యవసాయానికి నీరు అందించడం కష్టమని సీఎం తెలిపారు. తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని, నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. రానున్న ఎనిమిది నుంచి పది నెలల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశుసంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. విద్యుత్ పొదుపు తప్పనిసరి.! అధిక ధర చెల్లించి విద్యుత్ కొనుగోలు చేయాలన్నా అందుబాటులో ఉండటం లేదని సీఎం వెల్లడించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగంలో పొదుపు పాటించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పగటిపూట అవసరం లేనప్పుడు ఫ్యాన్లు, ఏసీల వినియోగాన్ని తగ్గించాలని, సౌర విద్యుత్‌ను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. రానున్న గడ్డుకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు పరిస్థితులపై ముందుగానే అవగాహన కల్పించాలని అన్నారు. కరవు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రజాప్రతినిధులంతా గ్రామాల్లో పర్యటించాలని సీఎం ఆదేశించారు. సంక్రాంతి తర్వాత నుంచి మే నెలాఖరు వరకు గ్రామాల బాట పట్టి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రామాల్లో ఉపాధి పనుల ద్వారా ప్రతి ఒక్కరికీ పని కల్పించేలా ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించాలని, ప్రజలకు ఆహార భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.