Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 19 October 2026, 5:46 pm Posted by : Anjaneyulu Dega

జర్నలిస్టుల రక్షణకు జాతీయ చట్టం తేవాలి: సోమ సుందర్

మంచిర్యాలలో ఐజేయూ ప్రధాన కార్యదర్శి సోమ సుందర్‌ను సన్మానిస్తున్న టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నాయకులు

మంచిర్యాల అక్టోబర్ 19, ( ఆంజనేయులు న్యూస్ )

జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ కోసం జాతీయ స్థాయిలో పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) సెక్రటరీ జనరల్ సోమ సుందర్ డిమాండ్ చేశారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం ఐజేయూ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నార్త్ ఇన్ హోటల్‌లో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమ సుందర్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమాల వార్తల కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు అమానుషంగా దాడులు చేస్తున్నారని సోమ సుందర్ ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనకారులతో వ్యవహరించినట్లుగా జర్నలిస్టులతో వ్యవహరించడం సరైన పద్ధతి కాదన్నారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడులు చేయడం, అక్రమ కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులు తమ విధులను స్వేచ్ఛగా నిర్వహించేలా రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని సోమ సుందర్ కోరారు. ఈ కోడ్‌ల వల్ల జర్నలిస్టులకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఉద్యోగ భద్రత, హక్కులు, సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలోని జర్నలిస్టులందరికీ ఉచిత వైద్య సేవలు అందించేలా హెల్త్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చొరవ చూపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రూపిరెడ్డి ప్రకాశ్ రెడ్డి, ఐజేయూ కౌన్సిల్ సభ్యుడు కేశెట్టి వంశీకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ రెడ్డి పింగిళి, సాక్షి స్టాఫ్ రిపోర్టర్ రాజు, ఎర్రం ప్రభాకర్, కాచం సతీష్, బిరుదుల దేవరాజ్, చొక్కారపు శ్రీనివాస్, ఆవుల శ్రీధర్, తిరుపతి, రాజేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.