రోడ్లపై పశువులను వదిలితే జరిమానాలు.. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిలా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు
నిర్మల్ అక్టోబర్ 17, ( ఆంజనేయులు న్యూస్ )
నిర్మల్ పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల ఆక్రమణలు, పశువుల సంచారం, ఇసుక అక్రమ రవాణాపై అధికారులు ఇక కఠినంగా వ్యవహరించాల్సిందేనని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా స్పష్టం చేశారు. పార్కింగ్ సదుపాయం లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తూ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించే వ్యాపార సముదాయాలను గుర్తించి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పారు. శనివారం కలెక్టరేట్లో ఎస్పీ జానకి షర్మిలాతో కలిసి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రోడ్లపై ఆక్రమణలను తొలగించాలని సూచించారు. జాతీయ రహదారులు, ప్రధాన రహదారులపై ప్రమాదకరంగా భారీ వాహనాలను నిలిపే వారిపైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లపై పశువులుంటే యజమానులదే బాధ్యత.! ప్రధాన రహదారులపై పశువులను వదిలి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పశువుల వల్ల ప్రమాదాలు, ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే యజమానులకు జరిమానాలు విధించడంతో పాటు అవసరమైన సందర్భాల్లో పశువులను స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిందే! జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ శాఖల నిర్మాణ పనులకు సైతం నిబంధనలకు అనుగుణంగానే ఇసుకను వినియోగించాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు (వీడీసీలు) నిబంధనలకు విరుద్ధంగా ఇసుక వేలం నిర్వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బ్లాక్ స్పాట్లపై ప్రత్యేక దృష్టి.! తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులకు సూచించారు. ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన రహదారి భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుతాం: ఎస్పీ. జిల్లాను మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ జానకి షర్మిలా తెలిపారు. వ్యవసాయ, ఎక్సైజ్ శాఖల సమన్వయంతో గంజాయి సాగు, విక్రయాలను అరికడుతున్నామని చెప్పారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. వివిధ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం త్వరగా అందేలా చర్యలు తీసుకుంటామని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని తెలిపారు. అనంతరం సైబర్ నేరాలపై అవగాహన కల్పించే ప్రత్యేక పోస్టర్ను అధికారులు ఆవిష్కరించారు. భూ సమస్యల పరిష్కారంలో జాప్యం వద్దు.! రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైన కలెక్టర్ ‘భూభారతి’, ‘సీఎం ప్రజావాణి’లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రాథోడ్ రమేష్, వెంకట మాధవ రావు, ఏఎస్పీలు సాయి కిరణ్, ఉపేంద్రా రెడ్డి, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.