సూచిక బోర్డులు లేక వాహనదారుల అవస్థలు.. ట్రాఫిక్ పోలీసుల తీరుపై అసహనం
మంచిర్యాల అక్టోబర్ 13, ( ఆంజనేయులు న్యూస్ )
మంచిర్యాల పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం సిగ్నల్స్ ఏర్పాటు చేసినా వాహనదారుల ఇబ్బందులు మాత్రం తీరడం లేదు. ముఖ్యంగా ఫ్రీ లెఫ్ట్ మార్గంలో వెళ్లే వాహనదారులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎడమవైపు వెళ్లాల్సిన మార్గంలోనే వాహనదారులు నిలిచిపోతుండటంతో ఫ్రీ లెఫ్ట్ ద్వారా వెళ్లాలనుకునే వారికి దారి లేకుండా పోతోంది. దీంతో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసిన ప్రయోజనం ఏమిటని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. ఫ్రీ లెఫ్ట్ మార్గాన్ని స్పష్టంగా సూచించే బోర్డులు లేకపోవడం, వాహనదారులకు సరైన మార్గనిర్దేశం చేసే ఏర్పాట్లు కనిపించకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ లెఫ్ట్ మార్గంలో వాహనాలు నిలిచిపోకుండా పర్యవేక్షించాల్సిన ట్రాఫిక్ సిబ్బంది తగిన చర్యలు తీసుకోవడం లేదని కొందరు వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడంతోనే బాధ్యత పూర్తికాదని, వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు అవసరమైన సూచిక బోర్డులు, స్పష్టమైన మార్గదర్శకాలు కూడా ఉండాలని వారు అంటున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు స్పందించి ఫ్రీ లెఫ్ట్ మార్గాన్ని గుర్తించేలా బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు, ఆ మార్గంలో వాహనాలు నిలవకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.. ఇదిలా ఉండగా.. మంచిర్యాల పట్టణంలోని లక్ష్మి థియేటర్ చౌరస్తాలో తాజాగా కనిపించిన దృశ్యం ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఫ్రీ లెఫ్ట్ మార్గాల పరిస్థితిని కళ్లకు కడుతోంది.