కరీంనగర్ అక్టోబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ )
కరీంనగర్ జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయంలో నియామకాలు, కుట్టుమిషన్ల పంపిణీలో అవకతవకలు జరిగాయంటూ 33వ డివిజన్ కాంగ్రెస్ నాయకురాలు షబానా మహమ్మద్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఫిర్యాదులో భాగంగా మహమ్మద్ బఖియార్ అనే డేటా ఎంట్రీ ఆపరేటర్ 2017 నుంచి అధికారిక నియామక ఉత్తర్వులు లేకుండానే విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. 2025 జూలైలో జరిగిన విచారణలో ఆయన నియామకం అనధికారికమని గుర్తించినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆయన కార్యాలయంలో కొనసాగుతున్నారన్న ఆరోపణలపై అధికారులు విచారణ జరపాలని కోరారు. అలాగే ప్రభుత్వ పథకం కింద కుట్టుమిషన్ల పంపిణీలో అర్హుల జాబితాలో మార్పులు చేసి అనర్హులకు మిషన్లు అందించినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. ఈ అంశాలపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని షబానా మహమ్మద్ జిల్లా కలెక్టర్‌ను కోరారు.