బతుకమ్మ సంబరాల వాల్ పోస్టర్‌ను విడుదల చేస్తున్న రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు
మంచిర్యాల అక్టోబర్ 7, ( ఆంజనేయులు న్యూస్ )
తెలంగాణ మహిళల ప్రీతిపాత్రమైన బతుకమ్మ సంబరాలు ఈనెల 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అక్టోబర్ 14న బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి శ్రీనివాస గార్డెన్‌లో ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు జిల్లా రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు గోనె మణిమాల రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను బుధవారం హైటెక్ సిటీ ప్రాంగణంలో జిల్లా, పట్టణ రెడ్డి మహిళా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మణిమాల రెడ్డి మాట్లాడుతూ.. రెడ్డి మహిళా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో గత పదేళ్లుగా మంచిర్యాల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ఏడాది నుంచి బతుకమ్మ సంబరాలను కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మంచిర్యాల పట్టణంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన రెడ్డి మహిళా బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.