వాటర్ ట్యాంకర్ అద్దె సొమ్ముపై వివాదం.. సర్పంచ్ భర్త తీరుపై ఆరోపణలు
ఖమ్మం అక్టోబర్ 7, ( ఆంజనేయులు న్యూస్ )
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని కొన్ని గ్రామపంచాయతీల్లో భార్యలు సర్పంచ్‌లుగా ఉండగా, వారి భర్తలే అధికారిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ పెత్తనం చెలాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా మండల పరిధిలోని ఓ గ్రామంలో గ్రామపంచాయతీకి చెందిన వాటర్ ట్యాంకర్‌ను అద్దెకు ఇచ్చిన సొమ్ము చుట్టూ వివాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. వాటర్ ట్యాంకర్ అద్దె ద్వారా వచ్చిన డబ్బులను గ్రామపంచాయతీ ఖాతాలో జమ చేయాలని కోరిన పంచాయతీ కార్యదర్శిపై సర్పంచ్ భర్త తన వర్గీయులతో కలిసి దాడికి సిద్ధమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కార్యదర్శి గ్రామంలోని పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గ్రామపంచాయతీకి సంబంధించిన నిధులు, ఆస్తుల వినియోగంపై ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుతున్నారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అన్న తరహాలో వ్యవహరిస్తున్నారంటూ సర్పంచ్ భర్తపై గ్రామస్తుల ఆరోపణలు. పంచాయతీ వ్యవహారాల్లో ఎన్నికైన సర్పంచ్ స్థానంలో భర్తల జోక్యం పెరుగుతోందని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, పంచాయతీ నిధులు, ఆస్తుల వినియోగంపై పారదర్శకంగా విచారణ చేపట్టాలని వారు కోరుతున్నారు.