Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 6:35 am Posted by : Anjaneyulu Dega

పేదల గుండెల్లో కాకా.. కార్మికుల పాలిట సంజీవని

కాకా వెంకటస్వామి ప్రజాసేవకు ఘన నివాళి.. 97వ జయంతి సందర్భంగా స్మరణ

మంచిర్యాల, అక్టోబర్ 4, ( ఆంజనేయులు న్యూస్ )

దళితుల ఆశాజ్యోతి, కార్మికుల పక్షపాతి, మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) 97వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. పేదలు, కార్మికులు, దళితుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన కాకా వెంకటస్వామి ప్రజాసేవకు అంకితమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. 1929 అక్టోబర్ 5న హైదరాబాద్‌లో జన్మించిన వెంకటస్వామి, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయాల స్ఫూర్తితో పేదలు, దళితుల విద్యాభివృద్ధికి కృషి చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందేలా విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో నిరుపేదల గుడిసెల తొలగింపునకు వ్యతిరేకంగా పోరాడి వేలాది కుటుంబాలకు నివాస హక్కు కల్పించేందుకు కృషి చేయడంతో ‘గుడిసెల వెంకటస్వామి’గా ప్రజల ఆదరణ పొందారు. కార్మికులు, పేదలు ఆప్యాయంగా ‘కాకా’ అని పిలుచుకునేవారు. శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా వివిధ బాధ్యతలు నిర్వహించిన వెంకటస్వామి కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. సింగరేణి సంస్థ సంక్షోభ సమయంలో కార్మికుల ఉద్యోగ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సంస్థ పునరుద్ధరణకు కృషి చేశారు. బొగ్గు గని కార్మికుల పెన్షన్, సంక్షేమం కోసం కూడా ఆయన చేసిన కృషి గుర్తుండిపోయింది. కాకా వెంకటస్వామి ఆశయాలను కొనసాగిస్తూ కార్మికులు, యువత, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామికి, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్‌లో పోరాడుతున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు అభినందనలు తెలిపారు.