Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 05 October 2026, 5:33 pm Posted by : Anjaneyulu Dega

కాకా ఆశయాలే.. సామాజిక న్యాయానికి స్ఫూర్తి: మంతెన జగన్మోహన్ రావు

మంచిర్యాలలో ఘనంగా గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు

కాకా విగ్రహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మంతెన జగన్మోహన్ రావు

మంచిర్యాల, అక్టోబర్ 5, (ఆంజనేయులు న్యూస్ )

కేంద్ర మాజీ కార్మిక, జౌళి శాఖ మంత్రి, దివంగత గడ్డం వెంకటస్వామి (కాకా) జయంతి వేడుకలను మంచిర్యాలలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మంతెన జగన్మోహన్ రావు పాల్గొని కాకా వెంకటస్వామికి ఘనంగా నివాళులర్పించారు. మంతెన జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో ఆయన నివాసం నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. డప్పు చప్పుళ్ల నడుమ ర్యాలీగా మంచిర్యాల రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న కాకా వెంకటస్వామి విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మంతెన జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. కాకా వెంకటస్వామి తన రాజకీయ జీవితాన్ని పేదలు, కార్మికులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికే అంకితం చేశారని అన్నారు. సామాజిక న్యాయం, పేద ప్రజల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కాకా వెంకటస్వామి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్న రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అదే మార్గంలో ముందుకు సాగుతున్నారని జగన్మోహన్ రావు అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వారు కృషి చేస్తున్నారని తెలిపారు. కాకా ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని మంతెన జగన్మోహన్ రావు అన్నారు.