Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 10:49 pm Posted by : Anjaneyulu Dega

పేదల గుండెల్లో కాకా.. కార్మికుల పాలిట సంజీవని

కాకా వెంకటస్వామి ప్రజాసేవకు ఘన నివాళి.. 97వ జయంతి సందర్భంగా స్మరణ

మంచిర్యాల, అక్టోబర్ 4, ( ఆంజనేయులు న్యూస్ )

తెలంగాణ గడ్డ కన్న ముద్దుబిడ్డ, దళితుల ఆశాజ్యోతి, కార్మికుల పక్షపాతి, మాజీ కేంద్ర మంత్రి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) 97వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. భవన నిర్మాణ కార్మికుడి స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఎదిగి ప్రజా సేవకు జీవితాన్ని అంకితం చేసిన కాకా వెంకటస్వామి సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని పేర్కొన్నారు. 1929 అక్టోబర్ 5న హైదరాబాద్‌లో సాధారణ కుటుంబంలో జన్మించిన వెంకటస్వామి పేదలు, కార్మికులు, దళితులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఆశయాలతో ప్రభావితమైన ఆయన విద్య ద్వారానే సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధ్యమని విశ్వసించారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించి అనేక విద్యాసంస్థలను నెలకొల్పారు. హైదరాబాద్‌లో గుడిసెల్లో నివసిస్తున్న పేదల నివాస హక్కుల కోసం వెంకటస్వామి చేసిన పోరాటం ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. నిరుపేదల గుడిసెలను తొలగించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఉద్యమించి వేలాది పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు దక్కేలా కృషి చేశారు. దీంతో ప్రజలు ఆయనను ఆప్యాయంగా ‘గుడిసెల వెంకటస్వామి’గా పిలుచుకున్నారు. పేదలు, కార్మికులు తమ కుటుంబంలోని పెద్ద దిక్కుగా భావించి ప్రేమగా ‘కాకా’ అని పిలిచేవారు. ప్రజల్లో ఉన్న ఆదరణతో శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా పలు మార్లు ఎన్నికై ప్రజలకు సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా కార్మిక, జౌళి, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల్లో బాధ్యతలు నిర్వహించారు. కార్మికుల సంక్షేమం కోసం అనేక కీలక నిర్ణయాలకు కృషి చేశారు. సింగరేణి సంస్థ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్న సమయంలో దానిని ప్రైవేటీకరణ లేదా మూసివేత నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సంస్థ పునరుద్ధరణకు కృషి చేశారని పేర్కొన్నారు. సింగరేణిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కార్మిక కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆయన చేసిన పోరాటం కార్మిక వర్గంలో చెరగని ముద్ర వేసిందన్నారు. బొగ్గు గని కార్మికుల పెన్షన్, ఉద్యోగ భద్రత, సంక్షేమం కోసం కూడా ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. దళితుల ఆత్మగౌరవం, రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం కాకా వెంకటస్వామి జీవితాంతం కృషి చేశారు. విద్య, ఉపాధి, సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పేద, దళిత విద్యార్థులకు అండగా నిలిచారు. ఆయన జీవితం స్వార్థరహిత ప్రజా సేవకు నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు. కాకా వెంకటస్వామి ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణలో కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం కృషి చేస్తున్న రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా తాత ఆశయాలను పుణికిపుచ్చుకుని సింగరేణి కార్మికుల సంక్షేమం, కార్మిక ప్రాంతాల అభివృద్ధి, రిటైర్డ్ కార్మికుల పెన్షన్ తదితర సమస్యల పరిష్కారం కోసం పార్లమెంట్‌లో కార్మికుల గొంతుకగా పోరాడుతున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. కాకా వెంకటస్వామి సేవలు, పోరాట స్ఫూర్తి, ప్రజా సంక్షేమ దృక్పథం నేటి తరానికి ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొంటూ ఆయన 97వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు.