Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 1:05 pm Posted by : Anjaneyulu Dega

గురుపరంపరకు ఘన నివాళి.. కూచిపూడి కళావైభవానికి వందనం

మంచిర్యాల, అక్టోబర్‌ 3, ( ఆంజనేయులు న్యూస్ )

ప్రముఖ నాట్యాచార్యులు శ్రీ భాగవతుల రామకోటయ్య సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన కుమారుడు, శిష్యుడు, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కూచిపూడి గురువు శ్రీ భాగవతుల సేతురామ్‌ ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 30న హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ‘వందే గురుపరంపర’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమ నిర్వహణలో శ్రీ భాగవతుల సాయిమోహిత్‌ రామ్‌ భాగస్వామ్యమయ్యారు. గురుశిష్య పరంపర గొప్పతనాన్ని, కూచిపూడి నాట్య వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకలో అనుపమా కైలాశ్‌, డాక్టర్‌ స్వాతి సోమనాథ్‌, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత కళాకృష్ణ, డాక్టర్‌ వనజా ఉదయ్‌, రంగమణి, డాక్టర్‌ రమాదేవి, డాక్టర్‌ భారతి, డాక్టర్‌ విజయ్‌ పాల్‌ తదితరులు పాల్గొన్నారు. రామకోటయ్య శిష్యులు, కళాకారులు, నాట్యాభిమానులు, కుటుంబ సభ్యులు హాజరై ఆయన కళాసేవను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ భాగవతుల సేతురామ్‌ మాట్లాడుతూ, గురుపరంపర అంటే కేవలం నాట్య విద్యను అభ్యసించడం మాత్రమే కాదని, గురువు నుంచి కళతో పాటు భక్తి, శ్రద్ధ, వినయం, క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం, మానవీయ విలువలను నేర్చుకుని జీవితంలో ఆచరించడమేనని అన్నారు. తన తండ్రి రామకోటయ్య నాట్యాన్ని కేవలం వినోదానికి పరిమితం చేయకుండా ఆధ్యాత్మికత, తాత్వికత, జీవన విలువలను ప్రజలకు చేరువ చేసే సాధనంగా మలిచారని గుర్తుచేశారు. తెలంగాణలో కూచిపూడి నాట్య విస్తరణకు రామకోటయ్య విశేష కృషి చేశారని వక్తలు పేర్కొన్నారు. అనేక మంది శిష్యులకు శిక్షణ అందించడంతో పాటు మహిళలకు నృత్య విద్యను అందించేందుకు కృషి చేశారని తెలిపారు. ‘పిండోత్పత్తి’, ‘సృష్టి తత్వం’, ‘జీవాత్మ–పరమాత్మ’ వంటి ఆధ్యాత్మిక అంశాలను నృత్యరూపకాలుగా మలిచి వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు, శిష్య బృందాలు హాజరయ్యారు. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన శ్రీ నందిని నృత్యాలయం ఫౌండర్‌, గురువు అన్నం కల్పనతో పాటు ఆమె శిష్య బృందం కూడా పాల్గొని శ్రీ భాగవతుల రామకోటయ్య కళాసేవకు నివాళులర్పించింది. గురుపరంపరను స్మరించుకుంటూ నిర్వహించిన ‘వందే గురుపరంపర’ కార్యక్రమం కళాభిమానుల సమక్షంలో ఘనంగా ముగిసింది.