Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 2:40 pm Posted by : Anjaneyulu Dega

రామ్ చెరువు పార్కులో కోతుల రాజ్యం!

మంచిర్యాల అక్టోబర్ 2, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రామ్ చెరువు పార్కులో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో వాకర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం వాకింగ్ కోసం పార్కుకు వచ్చే ప్రజలు కోతుల భయంతో జాగ్రత్తగా నడవాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు ఏ సమయంలో కోతులు దాడి చేస్తాయోనన్న భయంతో చేతిలో కట్టెలు పట్టుకుని నడుస్తున్నారని వాకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గురువారం పార్కు పరిసరాల్లో కోతులు ఇద్దరిపై దాడి చేసి కొరికినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో పార్కుకు వచ్చే ప్రజల్లో మరింత భయాందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, స్కూల్ విద్యార్థులు సైతం ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుండటంతో వారి భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్కులో కోతుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వాటి నియంత్రణకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కోతుల దాడుల కారణంగా ఎవరైనా తీవ్రంగా గాయపడిన తర్వాత చర్యలు చేపట్టకుండా, ముందుగానే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. రామ్ చెరువు పార్కుకు వచ్చే వాకర్లు, చిన్నారులు, మహిళలు, వృద్ధుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కోతుల నియంత్రణకు వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు, వాకర్లు సంబంధిత అధికారులను కోరుతున్నారు.