రంగారెడ్డి అక్టోబర్ 1, ( ఆంజనేయులు న్యూస్ )
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళ్‌పల్లి గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమికి ప్రైవేటు వ్యక్తి పేరుతో పట్టా జారీ అయినట్లు వెలుగులోకి వచ్చిన వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వానికి చెందిన సుమారు 4.25 ఎకరాల భూమికి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి, భూ రికార్డుల్లో మార్పులు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్వే నంబర్ 96లోని ఈ భూమికి సంబంధించి వహీదా బేగం పేరుతో పట్టా పాస్‌పుస్తకం కూడా జారీ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ భూమి మార్కెట్ విలువ సుమారు రూ.50 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తి పేరుపై ఎలా నమోదైంది? పట్టా పాస్‌పుస్తకం ఏ ప్రాతిపదికన జారీ అయింది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు, పట్టాకు సంబంధించిన పత్రాల్లో తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో భూ రికార్డుల్లో మార్పులు ఎప్పుడు జరిగాయి? వాటిని ఎవరు చేశారు? పట్టా జారీ ప్రక్రియలో ఎవరెవరి పాత్ర ఉంది? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రూ.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి సంబంధించి ఇలాంటి వ్యవహారం చోటుచేసుకోవడం తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. రికార్డులు, పట్టా జారీకి సంబంధించిన పత్రాలు, అధికారుల సంతకాలు తదితర అంశాలపై పూర్తిస్థాయి విచారణ చేపడితే ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.