మంచిర్యాల, సెప్టెంబర్ 23, ( ఆంజనేయులు న్యూస్ )
ప్రసవం కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించే పేద, మధ్యతరగతి కుటుంబాల అమాయకత్వమే కొందరికి టార్గెట్‌గా మారుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రసవం కోసం ఆస్పత్రులను ఆశ్రయించిన కొంతమంది గర్భిణీలు, వారి కుటుంబ సభ్యులు తమకు ఎదురైన అనుభవాలను వెల్లడిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “తల్లి, బిడ్డకు ప్రమాదం ఉంది.. ఆపరేషన్ చేయాల్సిందే” అంటూ ఆందోళనకు గురిచేస్తున్నారని కొందరు గర్భిణీలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా “ఉమ్మనీరు తగ్గింది.. పేగు మెడకు చుట్టుకుంది” అంటూ కుటుంబ సభ్యులను భయాందోళనకు గురిచేస్తున్నారని వారు చెబుతున్నారు. “మొదట సాధారణ ప్రసవం అవుతుందని చెప్పారు. ఆ తర్వాత పరిస్థితి మారిందని, వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఏం జరుగుతుందో అర్థం కాక భయపడి కుటుంబ సభ్యులు అంగీకరించారు” అని ఓ గర్భిణీ తెలిపింది. మరో గర్భిణీ కుటుంబ సభ్యులు కూడా ఇదే తరహా అనుభవాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. తొలి కాన్పు కావడంతో వైద్యపరమైన విషయాలపై పూర్తి అవగాహన లేకపోవడం, వైద్యులు చెప్పే మాటలపై పూర్తిగా ఆధారపడాల్సి రావడంతో కొంతమంది కుటుంబాలు వైద్యుల సూచనలకే ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని బాధితులు పేర్కొంటున్నారు. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నప్పటికీ సిజేరియన్ వైపు మళ్లిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రసవం పేరుతో ప్రైవేట్ వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారుతోందని పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఒక్క సిజేరియన్ ప్రక్రియకే కాకుండా ఆస్పత్రి బిల్లులు, మందులు, పరీక్షలు, గది చార్జీలు తదితరాలతో కలిపి వేల నుంచి లక్షల రూపాయల వరకు ఖర్చవుతున్న సందర్భాలు ఉన్నాయని కుటుంబాలు చెబుతున్నాయి. ప్రసవానికి ముందు చికిత్స ఖర్చులు, అవసరమైన వైద్య ప్రక్రియలు, ఆపరేషన్ అవసరానికి సంబంధించిన కారణాలను కుటుంబ సభ్యులకు స్పష్టంగా తెలియజేయాలని పలువురు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరుగుతున్న ప్రసవాలు, సాధారణ ప్రసవాలు–సిజేరియన్ ప్రసవాల నిష్పత్తిపై వైద్యారోగ్యశాఖ అధికారులు దృష్టి సారించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ముఖ్యంగా అధిక సంఖ్యలో సిజేరియన్లు జరుగుతున్న ఆస్పత్రుల వైద్య రికార్డులను పరిశీలించి, ఆపరేషన్ల అవసరం, చికిత్స విధానాలను సమగ్రంగా పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. గర్భిణీ భయం.. కుటుంబం ఆందోళన.. ప్రైవేట్ ఆస్పత్రి బిల్లు.. ఈ మూడు మధ్య పేద, మధ్యతరగతి కుటుంబాలు నలిగిపోకుండా సంబంధిత అధికారులు దృష్టి సారించి వాస్తవాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉంది.