వరంగల్ సెప్టెంబర్ 20, ( ఆంజనేయులు న్యూస్ )
ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ తీరుపై తీవ్ర ప్రశ్నలు తలెత్తించేలా వర్ధన్నపేట ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. మార్చురీలో భద్రపరిచిన మృతదేహాన్ని ఎలుకలు కొరికిన ఘటన కలకలం రేపింది. వరంగల్ జిల్లాకు చెందిన గారె వీరయ్య శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. శవపంచనామా, పోస్టుమార్టం నిమిత్తం శనివారం రాత్రి ఆయన మృతదేహాన్ని వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదివారం ఉదయం పోస్టుమార్టం కోసం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి వెళ్లగా, మృతదేహంలోని కంటి భాగం వద్ద ఎలుకలు కొరికిన ఆనవాళ్లు కనిపించడంతో వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతదేహాలను భద్రపరిచేందుకు మార్చురీలో కనీస వసతులు లేకపోవడం, ఫ్రీజర్ సౌకర్యం అందుబాటులో లేకపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని మృతుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే విషాదంలో ఉన్న కుటుంబానికి ఈ ఘటన మరింత వేదనను మిగిల్చిందని కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య పరిస్థితులు, మార్చురీ నిర్వహణపై స్థానికులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతదేహాలను సైతం సురక్షితంగా భద్రపరచలేని పరిస్థితులు నెలకొనడం దారుణమని మండిపడ్డారు. ఆసుపత్రిలో తక్షణమే ఆధునిక మార్చురీ వసతులు, ఫ్రీజర్లను ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.