Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 10:11 pm Posted by : Anjaneyulu Dega

శాస్త్ర సదస్సులో కార్మెల్‌ విద్యార్థిని సత్తా.. జిల్లా స్థాయిలో ప్రథమం

రిషితకు ప్రథమ బహుమతి అందజేస్తున్న డీఎస్‌ఓ రాజగోపాల్, ఉపాధ్యాయులు

మంచిర్యాల, సెప్టెంబర్ 17, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల జిల్లా సైన్సు కార్యాలయం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17, గురువారం జిల్లా స్థాయి శాస్త్ర సదస్సు (Science Seminar) అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 50 పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ‘2047 నాటికి భారత ఇంధన బుట్ట–అవకాశాలు, సవాళ్లు’ (Indian Energy Basket–2047: Prospects and Challenges) అనే అంశంపై నిర్వహించిన సదస్సులో కార్మెల్‌ కాన్వెంట్‌ ఉన్నత పాఠశాల–సీబీఎస్‌ఈ, మంచిర్యాలకు చెందిన తొమ్మిదో తరగతి ‘ఎ’ విభాగం విద్యార్థిని బి. రిషిత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. దీంతో ఆమె రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించిన రిషితకు జిల్లా సైన్సు అధికారి (డీఎస్‌ఓ) రాజగోపాల్ ప్రథమ బహుమతిని అందజేసి అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. రిషిత సాధించిన విజయంపై కార్మెల్‌ కాన్వెంట్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్‌ రినెట్, ఉప ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్‌ కృప, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం (Scientific Temper), సృజనాత్మక ఆలోచన, పరిశోధనా దృక్పథాన్ని (Research Orientation) పెంపొందించేందుకు పాఠశాల నిరంతరం ప్రోత్సహిస్తోందని తెలిపారు.