Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 7:37 pm Posted by : Anjaneyulu Dega

టీకాల నిల్వలపై డీఎంహెచ్‌ఓ నరేందర్‌ రాథోడ్‌ ఫోకస్‌..!

మంచిర్యాల సెప్టెంబర్ 16, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల జిల్లాలో అన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌ తెలిపారు. బుధవారం మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆర్‌ఎంవో డాక్టర్‌ కుమారస్వామితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అందిస్తున్న మాతా శిశు వైద్య సేవలు, టీకాల కార్యక్రమాన్ని పరిశీలించారు. జిల్లాలో వ్యాక్సిన్ల కొరత లేదని, అన్ని రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయని డీఎంహెచ్‌ఓ తెలిపారు. ఏదైనా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైన వ్యాక్సిన్‌ అందుబాటులో లేకపోతే సమీపంలోని మరో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వెంటనే తీసుకెళ్లి వినియోగించాలని అధికారులను ఆదేశించారు. అన్ని పీహెచ్‌సీల్లో వ్యాక్సిన్‌ నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అవసరమైన మేరకు అందుబాటులో ఉంచాలని సూచించారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న టీకాల కార్యక్రమాన్ని పరిశీలించిన ఆయన.. పిల్లలు, గర్భిణుల టీకాల నమోదును ఎప్పటికప్పుడు చేపట్టాలని సూచించారు. టీకాలు పొందిన వారి వివరాలను మాతా శిశు సంరక్షణ కార్డుల్లో నమోదు చేయడంతో పాటు యూవిన్‌ పోర్టల్‌లోనూ తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. రోజువారీగా పిల్లల నమోదును పూర్తి చేసి, అవసరమైన వ్యాక్సిన్లను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. టీకాల కార్యక్రమంలో పీపీ యూనిట్‌ వైద్యాధికారి డాక్టర్‌ పూర్ణ, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రం నర్సింగ్‌ అధికారులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్లు సైతం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. జిల్లా వ్యాక్సిన్‌ మేనేజర్‌ అఖిల్‌ రోజువారీగా వ్యాక్సిన్‌ నిల్వలను పర్యవేక్షించాలని డీఎంహెచ్‌ఓ ఆదేశించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు రోజువారీ వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు తెలియజేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్‌ నిల్వలను పరిశీలించి, ఎక్కడైనా కొరత ఉంటే వెంటనే అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో అన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని డీఎంహెచ్‌ఓ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ ఫార్మసీ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, జిల్లా మాస్‌ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్‌, నర్సింగ్‌ అధికారులు అఖిల్‌ పాషా, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.