మంచిర్యాల సెప్టెంబర్ 13, ( ఆంజనేయులు న్యూస్ )
ఎన్‌హెచ్-63 గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాలకు చెందిన సుమారు 150 మంది రైతులు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావును కలిసి తమ సమస్యలను విన్నవించారు. తమ భూములను తీసుకోవద్దని కోరారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు కారణంగా సర్వం కోల్పోయామని, ప్రస్తుతం తమకు మిగిలిన కొద్దిపాటి భూమిని కూడా ఎన్‌హెచ్-63 గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం తీసుకుంటే తమ కుటుంబాల జీవనాధారం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూములను కాపాడి ఆదుకోవాలని ఎమ్మెల్యేను కోరారు. రైతుల సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు “రైతుల భూములు కోల్పోనివ్వను.. మీకు అండగా ఉంటా” అని భరోసా ఇచ్చారు. రైతుల సమక్షంలోనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని, నోటీసుల ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించారు. అలాగే ప్రతి గ్రామంలో గ్రామసభలు నిర్వహించి రైతుల అభిప్రాయాలను తెలుసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామసభకు తానే హాజరవుతానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. దీంతో రైతుల్లో భరోసా ఏర్పడింది. తమ సమస్యపై స్పందించి అండగా నిలిచిన ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.