Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 3:25 pm Posted by : Anjaneyulu Dega

పీవీటీజీలకు మెరుగైన వైద్య సేవలు: అదనపు కలెక్టర్ చంద్రయ్య

మంచిర్యాల సెప్టెంబర్ 10, ( ఆంజనేయులు న్యూస్ )

ప్రధానమంత్రి ఆదివాసి న్యాయ మహా అభియాన్‌ (పీఎం జన్మన్‌) కార్యక్రమం ద్వారా ఆదిమ గిరిజన జాతులకు మెరుగైన వైద్య, ఆరోగ్య, సంక్షేమ సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని అదనపు జిల్లా కలెక్టర్ చంద్రయ్య ఐఏఎస్ అన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా కాశిపేట మండలం వెంకటాపూర్ ఆదివాసీ పీవీటీజీ గ్రామంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన సంక్షేమ శాఖ, ఐటీడీఏ ఉట్నూర్ ఆధ్వర్యంలో నిర్మించిన మల్టీపర్పస్ కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పీవీటీజీ కుటుంబాలకు గ్రామస్థాయిలోనే వైద్య సేవలు, పౌష్టికాహారం, సంక్షేమ పథకాలు, విద్య తదితర సేవలు అందుబాటులో ఉండేలా మల్టీపర్పస్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్రంలో ప్రాథమిక విద్యా కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు, క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించే పోస్టర్లు, సమాచారాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో అందుతున్న వైద్య సేవలు, పౌష్టికాహారం, అంగన్‌వాడీ కార్యకర్తల విధులు, గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలు, చిన్నారుల టీకాల కార్యక్రమం, అసంక్రమణ వ్యాధుల పరీక్షల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులతో విద్యుత్‌, తాగునీరు, గృహాలు, పింఛన్లు, ఆరోగ్యం, విద్య, రహదారులు, చేయూత తదితర అంశాలపై సమీక్షించారు. ప్రతి వారం మూడు గ్రామాలకు చెందిన ప్రజల కోసం ఒకసారి వైద్య శిబిరం నిర్వహించాలని, పీఎం జన్మన్‌ కార్యక్రమం కింద వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించడంపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. మారుమూల ప్రాంతంలోని ఆదిమ గిరిజనులకు అందుతున్న వైద్య, ఆరోగ్య సేవలపై అదనపు కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పంద్రం శంకర్, ఉప సర్పంచ్ ప్రసన్న, ఎంపీవో సాజిద్ అలీ, ఎంపీడీవో సత్యనారాయణ సింగ్, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, వైద్యాధికారి డాక్టర్ దివ్య, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, పుట్ట సత్తయ్య, గ్రామపంచాయతీ కార్యదర్శి సునీత, ఆరోగ్య కార్యకర్తలు సుజాత, లక్ష్మి, ఆశా కార్యకర్తలు, పీఎం జన్మన్‌ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.