Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 10:19 am Posted by : Anjaneyulu Dega

వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి: ఏసీపీ ప్రకాష్

మంచిర్యాల సెప్టెంబర్ 8, ( ఆంజనేయులు న్యూస్ )

ఈనెల 14 నుంచి జరగనున్న వినాయక నవరాత్రి ఉత్సవాలను మండపాల నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ సూచించారు. మంగళవారం స్థానిక ఎం. కన్వెన్షన్‌లో వినాయక మండపాల నిర్వాహకులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మండపం నిర్వాహకులు పోలీసులకు తప్పనిసరిగా సమాచారం అందించి, పోలీసుల సూచనలు పాటించాలన్నారు. మండపాలకు విద్యుత్‌ కనెక్షన్‌కు అనుమతి పొందాలని, రహదారులను పూర్తిగా మూసివేసేలా మండపాలు ఏర్పాటు చేయరాదని సూచించారు. నిమజ్జనం రోజు పోలీసుల సూచనల మేరకు సమయానుకూలంగా విగ్రహాలను తరలించాలన్నారు. మద్యం సేవించడం, గొడవలకు పాల్పడటం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. మండపాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, మద్యం, జూదం వంటి వాటికి తావివ్వరాదన్నారు. ఆకతాయిల ఆగడాలను ఉపేక్షించబోమని, రౌడీషీటర్లు, పాత నేరస్తులపై నిఘా పెంచడంతో పాటు అవసరమైన వారిని బైండోవర్‌ చేస్తామని హెచ్చరించారు. మండపాల వద్ద డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వబోమన్నారు. పట్టణంలో రోడ్డు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో నిమజ్జనం రోజున ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయని తెలిపారు. ప్రతి మండపం వద్ద కమిటీ సభ్యులు రాత్రివేళల్లో నిఘా ఉంచాలని సూచించారు. నిర్వాహకుల అభిప్రాయాలను కూడా ఏసీపీ తెలుసుకున్నారు.ఈ సమావేశంలో పట్టణ సీఐ ప్రమోద్‌రావు, ఎస్‌ఐలు మధుసూదన్, రమేష్, శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.