మంచిర్యాల సెప్టెంబర్ 8, ( ఆంజనేయులు న్యూస్ )
అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో హాజీపూర్ మండలం కొల్లంగూడ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సేవా కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు, కార్యక్రమ చైర్‌పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి సహాయ సహకారాలతో పాఠశాలలోని 25 మంది విద్యార్థినీ విద్యార్థులకు అవసరమైన స్కూల్ బ్యాగులు, నోట్‌బుక్స్, స్టేషనరీ సామగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి శ్రీ రాజేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమ చైర్‌పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను అందించేందుకు సంస్థ తరఫున నిరంతరం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కొల్లంగూడ ఒక గిరిజన గ్రామమని, ఇక్కడి పేద గిరిజన విద్యార్థులకు విద్యాపరంగా తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మధుసూదన్ రెడ్డి తెలిపారు. అనంతరం విద్యార్థులతో కలిసి అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని నిర్వహించి, విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ పి. వెంకటేశ్వర్లు, కార్యక్రమ చైర్‌పర్సన్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య, సీనియర్ లయన్ సభ్యులు లయన్ వినయ్ కుమార్, లయన్ పి. ప్రభాకర్ రావు, లయన్ డేగ బాబు, గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.