Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 5:36 pm Posted by : Anjaneyulu Dega

ఎన్‌హెచ్‌–63 బాధిత రైతుల ధర్నా

మంచిర్యాల, సెప్టెంబర్ 7, ( ఆంజనేయులు న్యూస్ )

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎన్‌హెచ్‌–63 బాధిత హాజీపూర్, లక్షెట్టిపేట మండలాల రైతులు ధర్నా నిర్వహించారు. తమ భూములకు సంబంధించిన కేసులు న్యాయస్థానాల పరిధిలో విచారణలో ఉండగానే రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. అనంతరం నోటీసుల ప్రతులను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు తుల మధుసూదన్ రావు, రైతులు మాట్లాడుతూ.. 2023లో నేషనల్ హైవే అధికారులు పాత రహదారి ప్రకారం రాయపట్నం నుంచి మంచిర్యాల వరకు అలైన్‌మెంట్ రూపొందించి గెజిట్‌ కూడా చేశారని తెలిపారు. అనంతరం రాజకీయ ఒత్తిళ్లు, ఇతర ప్రయోజనాల కారణంగా అలైన్‌మెంట్‌ను మార్చి బ్రౌన్‌ఫీల్డ్‌కు బదులుగా గ్రీన్‌ఫీల్డ్‌గా మార్చారని ఆరోపించారు. రాష్ట్ర మంత్రి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ అలైన్‌మెంట్ మార్పులో కీలకంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. స్థానికేతర కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం చేకూర్చేలా అలైన్‌మెంట్ మార్చేందుకు పైరవీలు జరిగాయని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను సంబంధిత వర్గాలు స్పష్టం చేయాల్సి ఉందన్నారు. కొత్త అలైన్‌మెంట్ వల్ల వందలాది మంది రైతుల కుటుంబాలు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురైన హాజీపూర్, లక్షెట్టిపేట మండలాల రైతులు తమ వద్ద మిగిలిన కొద్దిపాటి వ్యవసాయ భూములతో జీవనం సాగిస్తున్నారని, ప్రస్తుతం రహదారి కోసం భూములు కోల్పోతే తమ జీవనాధారం పూర్తిగా దెబ్బతింటుందని అన్నారు. రైతులు హైకోర్టును ఆశ్రయించి న్యాయం కోసం పోరాడుతున్న సమయంలో తుది తీర్పు వెలువడకముందే రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం సరికాదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే జారీ చేసిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, హైకోర్టు తుది తీర్పు వచ్చే వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోరాదని డిమాండ్ చేశారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ప్రజాస్వామ్యం, రైతుల సంక్షేమంపై తన చిత్తశుద్ధిని చాటుకోవాలంటే ఈ సమస్యపై స్పందించాలని కోరారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్‌ను బ్రౌన్‌ఫీల్డ్‌గా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈ విషయంలో జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. తమ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో రైతులు ప్రభావితమవుతున్నప్పటికీ ఈ అంశంపై ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. రైతుల సమస్యపై ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగాలని, అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో దశలవారీగా ఆందోళనలు చేపడతామని రైతులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు తుల మధుసూదన్ రావు, మున్నా రాజా సిసోడియా, కాసెట్టి నాగేశ్వరరావు, బోయిని హరికృష్ణ, మేడిపల్లి సత్యంతో పాటు రైతులు వడనాల శ్యాంసుందర్, లగిశెట్టి రాజమౌళి, ఉస్మాన్ పాషా, మల్లేష్, తిరుపతి, భీమన్న, మేడిపల్లి సంపత్ తదితరులు పాల్గొన్నారు.