Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 7:29 pm Posted by : Anjaneyulu Dega

హియరింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలి: డా. యోగితా రాణా

ఆసిఫాబాద్, సెప్టెంబర్ 7, ( ఆంజనేయులు న్యూస్ )

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా నిర్వహిస్తున్న హియరింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని ప్రత్యేక ఓటరు సవరణ పరిశీలకురాలు, రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డా. యోగితా రాణా కోరారు. అర్హులైన ఏ ఒక్కరి పేరు ఓటరు జాబితా నుంచి తొలగకుండా, అనర్హుల పేర్లు జాబితాలో ఉండకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో హియరింగ్ ప్రక్రియపై నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ కె. హరిత, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్మ చౌదరి, ఆసిఫాబాద్ ఆర్డీవో లోకేశ్వర్ రావులతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డా. యోగితా రాణా మాట్లాడుతూ.. హియరింగ్ ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్లు ఎన్నికల సంఘం ఆమోదించిన 11 రకాల ధ్రువపత్రాల్లో ఏదైనా ఒక ధ్రువపత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులు, ఇతర దేశాల్లో ఉన్న ఓటర్ల తరఫున వారి కుటుంబ సభ్యులు సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించే అవకాశం ఉందన్నారు. ఎన్నికల సంఘం ఆమోదించిన 11 రకాల ధ్రువపత్రాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే తమ బూత్ స్థాయి ఏజెంట్లను హియరింగ్ ప్రక్రియలో భాగస్వాములను చేసి, ప్రక్రియ సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ కె. హరిత మాట్లాడుతూ జిల్లాలో హియరింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నోటీసుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని, హియరింగ్ ప్రదేశం, తేదీ, సమయాన్ని బూత్ స్థాయి అధికారుల ద్వారా ముందుగానే ఓటర్లకు తెలియజేస్తున్నామని వివరించారు. గ్రామాల్లో చాటింపు ద్వారా కూడా ప్రజలకు సమాచారం అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన ఓటర్ల పేరు ఒక్కటి కూడా జాబితా నుంచి తొలగిపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.