Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 4:58 pm Posted by : Anjaneyulu Dega

రోడ్డు లేక గర్భిణీకి నరకయాతన..! ఎడ్లబండిపైనే ప్రసవ వేదనతో ప్రయాణం..

సర్కేపల్లిలో రహదారి కష్టాలు.. వైద్యం, విద్య కోసం వెళ్లాలన్నా ఇబ్బందులే..

శాశ్వత రహదారి నిర్మించాలని గ్రామస్తుల డిమాండ్

ఆసిఫాబాద్ సెప్టెంబర్ 5, ( ఆంజనేయులు న్యూస్ )

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం రహదారి సౌకర్యం లేక అత్యవసర పరిస్థితుల్లో సైతం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సర్కేపల్లి గ్రామంలో వెలుగుచూసింది. తాజాగా పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీని అంబులెన్స్‌ వద్దకు తీసుకెళ్లేందుకు ఎడ్లబండిని ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఘటన గ్రామంలో రహదారి సమస్య తీవ్రతను మరోసారి కళ్లకు కట్టింది.
సర్కేపల్లి గ్రామానికి చెందిన గర్భిణీ కరిష్మాకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అంబులెన్స్‌ గ్రామానికి బయలుదేరినప్పటికీ.. మారేపల్లి వద్ద రహదారి బురదమయంగా మారడంతో ముందుకు వెళ్లలేక నిలిచిపోయింది. దీంతో చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కలిసి కరిష్మాను ఎడ్లబండిపై అంబులెన్స్‌ వరకు తరలించారు.
అక్కడి నుంచి ఆమెను వాంకిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఆసుపత్రికి చేరిన కొద్దిసేపటికే కరిష్మా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు.

• వర్షాకాలంలో మరింత దారుణం:

సర్కేపల్లి–మారేపల్లి మార్గం వర్షాకాలంలో బురదమయంగా మారడంతో రాకపోకలు తీవ్రంగా ఇబ్బందికరంగా మారుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనాలు సైతం రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంటోందని చెబుతున్నారు.
అత్యవసర సమయంలో 108 అంబులెన్స్‌ సైతం గ్రామానికి చేరుకోలేని పరిస్థితి ఉంటే తమ పరిస్థితి ఏంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గర్భిణీలు, వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు వైద్యం కోసం మండల కేంద్రానికి వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

• వైద్యానికే కాదు.. విద్యకూ రహదారి అడ్డంకే:

రహదారి సమస్య కేవలం వైద్య అత్యవసరాలకే పరిమితం కాలేదని గ్రామస్తులు అంటున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు, ప్రజలు నిత్యావసరాల కోసం బయటకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
రోడ్డు సౌకర్యం లేక సకాలంలో వైద్యం అందక గతంలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ సమస్యపై అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.

• ఇప్పటికైనా అధికారులు స్పందించాలి:

సర్కేపల్లి–మారేపల్లి మార్గాన్ని అధికారులు తక్షణమే పరిశీలించి, బురద రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మరో అత్యవసర పరిస్థితి వచ్చే వరకు వేచి చూడకుండా రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. “గర్భిణీని ఆసుపత్రికి తరలించేందుకు ఎడ్లబండిని ఆశ్రయించే పరిస్థితి ఇకనైనా మారాలి. మరో ప్రాణం పోయేలోపు అధికారులు స్పందించాలి” అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.