మంచిర్యాల, ఆగస్టు 25, ( ఆంజనేయులు న్యూస్ )
నేత్రదానం ఆవశ్యకత, ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా అంధత్వ నియంత్రణ సంస్థ, లయన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నేత్రదాన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు జిల్లావ్యాప్తంగా నేత్రదానం, దాని ప్రాముఖ్యతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా అంధత్వ నివారణ అధికారి ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్, స్వచ్ఛంద సంస్థలు, ఆరోగ్యశాఖ సిబ్బంది సహకారంతో పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు, మున్సిపల్ పరిధిలోని ఉద్యోగులు, సిబ్బందికి, గ్రామాల్లో ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, వైద్యాధికారుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మహిళా సంఘాలకు కూడా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. దేశంలో కార్నియా సంబంధిత సమస్యల కారణంగా అనేక మంది చూపును కోల్పోతున్నారని, అలాంటి వారికి నేత్రదానం ద్వారా చూపును ప్రసాదించే అవకాశం ఉందని డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. గాయాలు, ప్రమాదాలు, పోషకాహార లోపం, వంశపారంపర్య కారణాలు, రసాయనాల ప్రభావం తదితర కారణాలతో కార్నియాకు నష్టం కలిగి చూపు కోల్పోయే పరిస్థితులు ఏర్పడవచ్చని వివరించారు. నేత్రదానం అన్ని మతాలకు చెందిన వారు చేయవచ్చని, స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నేత్రదానానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా చూపులేని వారి జీవితాల్లో వెలుగులు నింపవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా నేత్రదానంపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలకు ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలతో పాటు నేత్రదానంపై అవగాహన కల్పించడం, కంటి వైద్య శస్త్రచికిత్సలకు సహకరించడంలో లయన్స్ క్లబ్ చేస్తున్న సేవలను డీఎంహెచ్‌వో అభినందించారు. జిల్లాలోని అన్ని స్వచ్ఛంద సంస్థలు నేత్రదానంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. జిల్లా మాస్ మీడియా బృందం ద్వారా కూడా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ అశోక్ కుమార్, నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ శ్రీధర్, జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్, జిల్లా కంటి అధికారి శ్రీ శంకర్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, రషీద్, నర్సింగ్ అధికారులు, సీహెచ్‌ఓలు పుట్ట సత్తయ్య, నాందేవ్, లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు, కార్యదర్శి, శ్రీ మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నేత్రదాన అవగాహనకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.