మంచిర్యాల, ఆగస్టు 24, ( ఆంజనేయులు న్యూస్ )
మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువులో జరుగుతున్న అవకతవకలపై గతంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు తుల మధుసూదన్ రావు తెలంగాణ లోకాయుక్తకు చేసిన ఫిర్యాదు మేరకు సోమవారం లోకాయుక్త పోలీసు అధికారులు చెరువును సందర్శించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఫిర్యాదు విచారణలో భాగంగా విచారణ అధికారి వసంశెట్టి వెంకటరమణమూర్తి రాముని చెరువును పరిశీలించారు. చెరువులో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలు, మత్తడి కూల్చివేతలు, చెరువు మధ్య నుంచి నిర్మించిన రోడ్డు, అక్రమంగా ఏర్పాటు చేసిన పార్కు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుడు తుల మధుసూదన్ రావు మాట్లాడుతూ.. పట్టణంలోని రాముని చెరువును పూర్తిగా అన్యాక్రాంతం చేసేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. చెరువు పరిరక్షణకు బాధ్యత వహించాల్సిన అధికారులు సైతం అక్రమాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే చెరువు బఫర్ జోన్‌లో అక్రమంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు జరుగుతున్నాయని, ఎఫ్‌టీఎల్ పరిధిని తగ్గించి, చెరువు భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారని, చెరువు పక్కన యథేచ్ఛగా మట్టిని పోస్తూ చెరువును పూడ్చే చర్యలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని అధికారులకు ప్రత్యక్షంగా చూపించారు. విచారణ అధికారి వెంకటరమణమూర్తి స్పందిస్తూ.. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలన్నింటిపై సమగ్ర నివేదికను తయారు చేసి లోకాయుక్తకు సమర్పిస్తామని తెలిపారు. అనంతరం లోకాయుక్త నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. చెరువును పరిరక్షించే అంశానికి ప్రాధాన్యతనిస్తూ, చట్ట పరిధిలోనే విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విచారణ అధికారి వెంకటరమణమూర్తి, బీజేపీ నాయకులు తుల మధుసూదన్ రావు, హరికృష్ణ, నీటిపారుదల శాఖ డీఈ సృజన, ఏఈ హరికృష్ణ, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాజుతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.