మంచిర్యాల, ఆగస్టు 22, ( ఆంజనేయులు న్యూస్ )
సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ చిన్ననాటి నుంచే విద్యార్థులను సమగ్రంగా తీర్చిదిద్దుతున్న సరస్వతి శిశు మందిరాల విద్యా విధానం భావి భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుందని మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, మంచిర్యాల మున్సిపల్ మేయర్ ధరణి మధుకర్ అన్నారు. శనివారం మంచిర్యాల సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో నిర్వహించిన శ్రీ సరస్వతీ విద్యాపీఠం తెలంగాణ విభాగ్ స్థాయి గణిత విజ్ఞాన సంస్కృతి మహోత్సవం కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. విభాగ్ పరిధిలోని 9 సరస్వతి శిశు మందిరాల నుంచి 287 మంది విద్యార్థులు, ప్రబంధకారిణులు పాల్గొని వివిధ గణిత, విజ్ఞాన అంశాలపై ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన వినూత్న నమూనాలు, ప్రయోగాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల్లో గణితంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు, గణిత శాస్త్రంలోని వివిధ అంశాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ గణిత విజ్ఞాన మేళను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. గణితం కేవలం పాఠ్యాంశం మాత్రమే కాదని, నిత్యజీవితంలో ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే ముఖ్యమైన శాస్త్రమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. విద్యార్థులు గణితంపై ఉన్న భయాన్ని వీడి ఆసక్తితో సాధన చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకత, శాస్త్రీయ ఆలోచనా విధానం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సత్తయ్య, జిల్లా సైన్స్ అధికారి రాజగోపాల్ రావు, ఎంఈఓ మాళవిక దేవి, కార్పొరేటర్లు షేర్ లక్ష్మీ పవన్, చిలువేరు జ్యోతి, సుధమల్ల హరికృష్ణ, విభాగ్ అధ్యక్షులు డాక్టర్ విష్ణువర్ధన్ రావు, కార్యదర్శి దహగాం గోవిందరావు, ఉపాధ్యక్షులు సదాశివ్, సహకార్యదర్శి గుండం అశోక్, కార్యక్రమ నిర్వాహకులు, పాఠశాల అధ్యక్షులు చందూరి మహేందర్, కార్యదర్శి గుండా సుధాకర్, కోశాధికారి కొమ్మెర విశ్వేశ్వర శర్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రజిని తదితరులు పాల్గొన్నారు.