టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం
మంచిర్యాల, ఆగస్టు 14 ( ఆంజనేయులు న్యూస్ )
మంచిర్యాల పట్టణంలోని గ్రీన్ సిటీ కాలనీలో అక్రమ షెడ్ల నిర్మాణాలపై మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో రోడ్లను ఆక్రమిస్తూ పలు ఇనుప షెడ్లు నిర్మించినా మూడు నెలలుగా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో ఓ నిరుపేద వ్యక్తి ఏర్పాటు చేసుకున్న చిన్న షెడ్డును మాత్రం అధికారులు వెంటనే కూల్చివేయడం విమర్శలకు దారితీసింది. గ్రీన్ సిటీలో రోడ్లను ఆక్రమిస్తూ ఇనుప షెడ్లు నిర్మిస్తున్నారంటూ మూడు నెలల క్రితమే ‘ఆంజనేయులు న్యూస్’లో కథనం ప్రచురితమైంది. షెడ్ల కారణంగా రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడటంతో పాటు అత్యవసర సమయంలో అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ వంటి వాహనాలు వెళ్లేందుకు కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అప్పట్లో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇప్పటివరకు కాలనీలోని పలు షెడ్లపై ఎలాంటి కూల్చివేత చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు. తాజాగా ఓ సామాన్య, నిరుపేద వ్యక్తి ఏర్పాటు చేసుకున్న చిన్న షెడ్డును మాత్రం టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే షెడ్డును తొలగించారని, మున్సిపల్ అనుమతి తీసుకునే ప్రక్రియలో ఉండగానే కూల్చివేయడంతో తీవ్రంగా నష్టపోయానని పేర్కొంటున్నాడు. పెద్ద ఎత్తున రోడ్లను ఆక్రమించి నిర్మించిన షెడ్లు నెలల తరబడి కొనసాగుతున్నప్పటికీ వాటిపై చర్యలు తీసుకోకుండా, పేదవాడి చిన్న షెడ్డుపై మాత్రమే వేగంగా చర్యలు తీసుకోవడంపై స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం తప్పు కాదని, అయితే నిబంధనలు అందరికీ సమానంగా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రీన్ సిటీలోని అన్ని షెడ్లపై అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి, అనుమతులు లేని నిర్మాణాలు, రోడ్లు లేదా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన షెడ్లను గుర్తించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు. మూడు నెలల క్రితమే అక్రమ షెడ్ల విషయం అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ స్పందించలేదని, ఇప్పుడు ఒక్క షెడ్డుపై మాత్రం వెంటనే చర్యలు తీసుకోవడం పట్ల ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి గ్రీన్ సిటీలోని అన్ని అక్రమ నిర్మాణాలపై పక్షపాతం లేకుండా సమానంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.