మంచిర్యాల, ఆగస్టు 14, ( ఆంజనేయులు న్యూస్ )
మంచిర్యాల లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌నగర్‌లోని లైన్స్ క్లబ్ ఆడిటోరియంలో క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల మండలానికి చెందిన 25 మంది క్షయ వ్యాధిగ్రస్తులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ పౌష్టికాహార కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందించేందుకు మంచిర్యాల లైన్స్ క్లబ్ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. క్షయ వ్యాధి నిర్మూలనలో మందులతో పాటు పౌష్టికాహారం, అవగాహన ఎంతో కీలకమని తెలిపారు. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా వ్యాధిగ్రస్తుల్లో రోగనిరోధక శక్తి పెరిగి, ఇతర అనారోగ్య సమస్యలను నివారించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి నమోదు చేయడంతో పాటు ఉచితంగా మందులు అందజేస్తోందని తెలిపారు. పౌష్టికాహారం కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.1,000 ఆర్థిక సహాయం అందిస్తోందని, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో పౌష్టికాహార కిట్లను కూడా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారం అందించేందుకు సహకరించాలని కోరారు. మందులు, పౌష్టికాహారం, అవగాహన కల్పించడం ద్వారా క్షయ వ్యాధిగ్రస్తులు త్వరగా కోలుకునేందుకు వీలుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ సభ్యులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరఫున డీఎంహెచ్‌వో కృతజ్ఞతలు తెలిపారు. లైన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, మధుసూదన్‌రెడ్డితో పాటు జిల్లా లైన్స్ క్లబ్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొని తమవంతు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, సీహెచ్‌వోలు నాందేవ్, శ్రీనివాస్, అల్లాడి శ్రీనివాస్, క్షయ వ్యాధి సమన్వయకర్త సురేందర్, సాయిరెడ్డి, ఎస్‌టీఎస్‌లు, లైన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.