మంచిర్యాల, ఆగస్టు 14, ( ఆంజనేయులు న్యూస్ )
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం సైకిల్ యాత్ర నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా నుంచి హాజీపూర్ మండల కేంద్రం వరకు ఈ యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి, వాటిని A, B, C, D గ్రూపులుగా వర్గీకరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా బీసీ డిక్లరేషన్‌లోని హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మహాత్మా జ్యోతిరావు పూలే పేరుతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు, ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టులు, మెయింటెనెన్స్ పనుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, బీసీ విద్యార్థుల ఉన్నత విద్య కోసం పూచీకత్తు లేకుండా రూ.10 లక్షల వరకు రుణాలు, బీసీ ఫెడరేషన్లు, కార్పొరేషన్ల పరిధిలోని సొసైటీలకు ఎన్నికలు నిర్వహించడం, రూ.10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించడం వంటి హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో బీసీ భవనాలు నిర్మించి అందులో లైబ్రరీ, స్టడీ సర్కిల్, ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు, ఐదేళ్లలో బీసీల సంక్షేమానికి రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించడం, జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టడం వంటి హామీలను కూడా అమలు చేయాలని కోరారు. అధికారంలోకి రావడానికి మాత్రమే బీసీ అంశాలను మేనిఫెస్టోలో చేర్చారా అనే అనుమానం బీసీ సమాజంలో వ్యక్తమవుతోందని శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ అంశాలను బీసీ సమాజం దృష్టికి తీసుకెళ్లి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ముందు దోషిగా నిలబెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షులు, ప్రజావాణి సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మహేష్ వర్మ, జిల్లా నాయకులు పడాల శివతేజ, భీమిని రమేష్, మహమ్మద్ లతీఫ్, తెలంగాణ బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మంచర్ల సదానందం, రజక సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు తంగళ్లపెల్లి బాపు, బీసీ నాయకులు సూరయ్య, వేముల కిరణ్, కీర్తి బిక్షపతి, న్యాయవాది కొట్టె నటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.