గ్రీన్‌సిటీ కాలనీ మీదుగా భారీ వాహనాల రాకపోకలు.. ప్రమాదం పొంచి ఉందంటున్న స్థానికులు
రోడ్లు గుంతలమయం.. బ్రిడ్జికి సైతం ముప్పు తప్పదంటున్న కాలనీవాసులు
మంచిర్యాల, ఆగస్టు 10, ( ఆంజనేయులు న్యూస్ )
మంచిర్యాల పట్టణంలోని గ్రీన్‌సిటీ కాలనీ మీదుగా ఓవర్‌లోడ్‌తో భారీ డాంబర్ వాహనాలు నిరంతరం రాకపోకలు సాగిస్తుండటంతో కాలనీవాసులు, చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బొక్కలగుట్ట వైపు నుంచి ఏంసీసీ క్వారీ నుంచి వస్తున్న భారీ వాహనాలు గ్రీన్‌సిటీ కాలనీ మీదుగా బ్రిడ్జి దాటి నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. కాలనీలో చిన్నారులు నిత్యం రోడ్లపై తిరుగుతుంటారని, భారీ ఓవర్‌లోడ్ వాహనాలు నిరంతరం రాకపోకలు సాగించడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే పరిస్థితి రాకుండా అధికారులు ముందుగానే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భారీ వాహనాలు ఓవర్‌లోడ్‌తో నిత్యం తిరగడం వల్ల కాలనీలోని రోడ్లు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, ఇదే పరిస్థితి కొనసాగితే రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారితే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఓవర్‌లోడ్ వాహనాలు నిరంతరం బ్రిడ్జిపై నుంచి రాకపోకలు సాగించడం వల్ల బ్రిడ్జిపై అధిక భారం పడే అవకాశం ఉందని, భవిష్యత్తులో బ్రిడ్జి నిర్మాణానికి కూడా నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదని కాలనీవాసులు పేర్కొంటున్నారు. భారీ వాహనాల రాకపోకలను ఇలాగే కొనసాగిస్తే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఓవర్‌లోడ్ వాహనాల రాకపోకలను నియంత్రించాలని, గ్రీన్‌సిటీ కాలనీ వైపు భారీ వాహనాలను రాకుండా ప్రత్యామ్నాయ మార్గంలో దారి మళ్లించాలని కాలనీవాసులు కోరుతున్నారు. చిన్నారుల భద్రత, ప్రజల రక్షణతో పాటు రోడ్లు, బ్రిడ్జికి నష్టం కలగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.