Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 11:39 am Posted by : Anjaneyulu Dega

టిఫిన్‌ సెంటర్‌లో పరిశుభ్రతపై ప్రశ్నలు!

హాట్‌ వాటర్‌ ఎక్కడ..? స్పూన్లు బౌల్‌లోనే!

ఫొటోలో స్పష్టమైన దృశ్యం.. తనిఖీలు చేయాలంటున్న భోజన ప్రియులు

మంచిర్యాల, ఆగస్టు 9, ( ఆంజనేయులు న్యూస్ )

జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా సమీపంలో ఇందు బార్‌ పక్కన నిర్వహిస్తున్న ఓ టిఫిన్‌ సెంటర్‌లో పరిశుభ్రత ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వినియోగదారులు ఉపయోగించే స్పూన్లను శుభ్రపరిచే విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. స్పూన్లను పెద్ద సంఖ్యలో ఓ సాధారణ బౌల్‌లో ఉంచిన దృశ్యం కనిపించడంతో భోజన ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యం ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోంది. స్పూన్లు, ప్లేట్లు, ఇతర పాత్రలను పరిశుభ్రంగా ఉంచుతున్నారా..? ఆహార పదార్థాలను సురక్షితమైన వాతావరణంలో తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నారా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రద్దీగా ఉండే ఐబీ చౌరస్తా ప్రాంతంలో ఆహార విక్రయ కేంద్రాలు పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం చేయకుండా నిబంధనలను పాటించాలని స్థానికులు కోరుతున్నారు.

• అనుమతులు ఉన్నాయా..?

మరోవైపు సదరు టిఫిన్‌ సెంటర్‌కు సంబంధించిన పేరు, లైసెన్స్‌, అనుమతుల వివరాలతో కూడిన బోర్డు కనిపించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. టిఫిన్‌ సెంటర్‌కు ఫుడ్‌ సేఫ్టీకి సంబంధించిన అనుమతులు ఉన్నాయా..? మున్సిపల్‌ అనుమతులు తీసుకున్నారా..? ఆహార భద్రత నిబంధనలు, పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తున్నారా..? అనే సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

• అధికారుల తనిఖీలు ఎప్పుడో..?

ఈ నేపథ్యంలో ఫుడ్‌ సేఫ్టీ, మున్సిపల్‌ అధికారులు స్పందించి సదరు టిఫిన్‌ సెంటర్‌ను తనిఖీ చేయాలని భోజన ప్రియులు కోరుతున్నారు. ఆహార పదార్థాల నాణ్యత, వంటశాల పరిశుభ్రత, స్పూన్లు–ప్లేట్లు–పాత్రల శుభ్రత, నీటి వినియోగం, లైసెన్సులు, ఇతర నిబంధనలను పరిశీలించాలని డిమాండ్‌ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా ఉన్నట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఐబీ చౌరస్తాలోని ఈ టిఫిన్‌ సెంటర్‌తో పాటు మంచిర్యాల పట్టణంలోని అన్ని టిఫిన్‌ సెంటర్లు, ఆహార విక్రయ కేంద్రాల్లోనూ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి పరిశుభ్రత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.