Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 4:28 pm Posted by : Anjaneyulu Dega

తల్లి పాలపై లయన్స్ క్లబ్ అవగాహన కార్యక్రమం.. తల్లులకు పండ్ల పంపిణీ

తల్లి పాల ప్రాముఖ్యతను వివరించిన విద్యావేత్త గుండేటి యోగీశ్వర్

మంచిర్యాల, ఆగస్టు 7, ( ఆంజనేయులు న్యూస్ )

తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు లయన్స్ క్లబ్ హైటెక్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడ ఒకటవ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం తల్లి పాల వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ప్రముఖ విద్యావేత్త గుండేటి యోగీశ్వర్ హాజరై తల్లి పాల ఆవశ్యకతను వివరించారు. శిశువు జన్మించిన మొదటి గంటలోనే ముర్రుపాలు అందించడం ఎంతో ముఖ్యమని, ఆరు నెలల వరకు తప్పనిసరిగా తల్లి పాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. వైద్యుల సలహా మేరకు రెండేళ్ల వరకు తల్లి పాలను కొనసాగించడం వల్ల శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో ఎదుగుతాడని తెలిపారు. తల్లి పాలు బిడ్డలో రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయని అన్నారు. తల్లి ఆరోగ్యానికి కూడా తల్లి పాలివ్వడం ఎంతో ప్రయోజనకరమని, రొమ్ము క్యాన్సర్, ఊబకాయం, టైప్-2 మధుమేహం వంటి సమస్యల ముప్పు తగ్గుతుందని వివరించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ సెక్రటరీ చెట్ల రామయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని గర్భిణీ స్త్రీలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రాజు పటేల్, సెక్రటరీ చెట్ల రామయ్య, క్లబ్ క్యాబినెట్ సభ్యులు సీహెచ్ హన్మంతరావు, లయన్స్ తిరుపతి, నరోత్తమరావు, అంగన్వాడీ టీచర్లు రమాదేవి, ఈశ్వరమ్మతో పాటు హమాలీవాడకు చెందిన తల్లులు, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు.