రూ.444 కోట్ల అప్పు ఎలా తీర్చారో వెల్లడించాలి
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుపై ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజం
మంచిర్యాల, ఆగస్టు 7, ( ఆంజనేయులు న్యూస్ )
మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావుపై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత రూ.444 కోట్ల అప్పును ఎలా తీర్చారో ప్రజలకు వివరించాలని కోరారు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అధికారులను, నాయకులను బెదిరిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా నెలకు సుమారు రూ.2.50 లక్షల జీతం పొందుతున్న వ్యక్తి రూ.444 కోట్ల అప్పును ఎలా తీర్చారన్న అంశంపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
• పవర్‌పాయింట్ ప్రజెంటేషన్:
మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు తనయుడు, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు.. ఎమ్మెల్యే రూ.444 కోట్ల అప్పు తీర్చిన అంశంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ వివరాలను సేకరించి ప్రజల ముందుంచినందుకు విజిత్‌రావును ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అభినందించారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే చెప్పినట్లు వ్యవహరించడం సరికాదని అన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆదేశాలు పాటిస్తే భవిష్యత్‌లో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై లోతైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు సైతం ఎమ్మెల్యేపై ఉన్న ఆరోపణలపై ఈడీకి ఫిర్యాదు చేయాలని సూచించారు.
• ఆస్తులు, లావాదేవీలు వెల్లడించాలి:
నడిపెల్లి విజిత్‌రావు మాట్లాడుతూ.. ఓ ప్రైవేట్ వ్యక్తిని అడ్డుపెట్టుకుని యువతను తప్పుదోవ పట్టిస్తూ పలువురిపై దాడులకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు తన ఆస్తులు, ఆర్థిక లావాదేవీల వివరాలను ప్రజల ముందు వెల్లడించాలని డిమాండ్ చేశారు. విదేశాల్లోనూ ఎమ్మెల్యేకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని ఆరోపించిన విజిత్‌రావు.. త్వరలో ఆధారాలతో సహా వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు గాదె సత్యం, అంకం నరేష్, మొగిలి శ్రీను, నాలుగో డివిజన్ కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ చంద్రశేఖర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు, టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.