ఇచ్చిన హామీలు నీళ్లమూట… నాయకులు రారు, అధికారులు పట్టించుకోరు… ఓట్లకే పరిమితమా
చదివిద్దాం అంటే బడి లేదు… బడికి పంపుదాం అంటే దారి లేదు
ఆంజనేయులు న్యూస్ స్పెషల్ ఫోకస్
మంచిర్యాల, ఆగస్టు 5, ( ఆంజనేయులు న్యూస్ )
అభివృద్ధి అందరికీ సమానంగా చేరాలనే ప్రభుత్వాల మాటలు వినిపిస్తున్నా… మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నెల మండలం పాటి, భోగంపల్లి గిరిజన గ్రామాల పరిస్థితి మాత్రం ఇప్పటికీ దశాబ్దాల వెనుకబాటుతనాన్ని తలపిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా ఈ గ్రామాలకు కనీస రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రెండు గ్రామాల్లో కలిపి సుమారు 50 కుటుంబాలు, 150 మందికి పైగా కొలాం గిరిజనులు నివసిస్తున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు గ్రామానికి వెళ్లే దారులు బురదమయమై రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. మెయిన్ రోడ్డుకు చేరుకోవాలంటే సుమారు రెండు కిలోమీటర్లు కాలినడకనే ప్రయాణించాల్సి వస్తోంది. గ్రామంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే అంబులెన్స్ గ్రామంలోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో బాధితులను ఎడ్ల బండిపై మెయిన్ రోడ్డుకు తరలించాల్సి వస్తోందని గ్రామస్థులు వాపోతున్నారు. అత్యవసర వైద్య సేవలు సకాలంలో అందక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి లేకపోవడం చిన్నారుల విద్యపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్షాలు కురిసిన రోజుల్లో పిల్లలు పాఠశాలకు వెళ్లలేక చదువుకు దూరమవుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. “చదివిద్దాం అంటే బడి లేదు… బడికి పంపుదాం అంటే దారి లేదు” అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు గ్రామానికి వచ్చి రహదారి, తాగునీరు, విద్య, వైద్యం వంటి సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇస్తారని, ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రం ఎవరూ గ్రామం వైపు తిరిగి చూడరని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు కూడా ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా స్పందించడం లేదని చెబుతున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఈగం పోషక్క మాట్లాడుతూ.. “మా ఊరికి రోడ్డు లేక ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. వర్షం పడితే బయటకు వెళ్లలేం. పిల్లలు బడికి వెళ్లలేరు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఎడ్ల బండిపైనే మెయిన్ రోడ్డుకు తీసుకెళ్లాల్సి వస్తోంది. ఎన్నికల సమయంలో నాయకులు వచ్చి హామీలు ఇస్తారు కానీ తర్వాత ఎవరూ మా గ్రామం వైపు చూడరు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి మా గ్రామానికి శాశ్వత రహదారి నిర్మించాలి,” అని కోరారు. పాటి, భోగంపల్లి గిరిజన గ్రామాలకు కనీస రహదారి సౌకర్యం కల్పించి విద్య, వైద్యం, ఉపాధి వంటి మౌలిక సదుపాయాలు అందేలా జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు తక్షణమే చర్యలు చేపట్టాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.