“తప్పుడు ప్రకటనలతో తల్లిదండ్రులను మోసం చేస్తే సహించం” హెచ్చరిక
హైదరాబాద్, ఆగస్టు 4, ( ఆంజనేయులు న్యూస్ )
ర్యాంకుల పేరుతో పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ప్రచురిస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మంగళవారం నారాయణగూడలోని శ్రీ చైతన్య విద్యాసంస్థలు కేంద్రాన్ని సందర్శించారు. ఫిర్యాదులపై వివరణ కోరుతూ కాలేజీ యాజమాన్యాన్ని ఆయన నిలదీశారు. పత్రికల్లో ప్రచురితమైన ప్రకటనల్లో పేర్కొన్న ర్యాంకులు, విద్యార్థుల వివరాలపై ప్రశ్నించారు. ప్రకటనల్లో చూపిస్తున్న సమాచారం, వాస్తవ పరిస్థితులు ఒకేలా లేవని ఆరోపిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన తీన్మార్ మల్లన్న, విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన అంశాల్లో తప్పుడు ప్రకటనలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే తాను స్వయంగా వచ్చి చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులను మభ్యపెట్టే ప్రకటనలను సహించబోమని స్పష్టం చేశారు. అయితే, ఈ వ్యవహారంపై శ్రీ చైతన్య విద్యాసంస్థలు యాజమాన్యం నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. ర్యాంకుల ప్రకటనలకు సంబంధించి ఎమ్మెల్సీ చేసిన ఆరోపణలపై సంస్థ వివరణ ఇవ్వాల్సి ఉంది.